హైదారాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో తలనొప్పి వచ్చేలా ఉంది. ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టడం ఆ సమస్య కొలిక్కిరావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసిన కార్మికులు తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు 52 రోజులు పనిచేసి ప్రభుత్వానికి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూశామని వారు తెలిపారు. 

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడం, ప్రభుత్వంతో చర్చలు సఫలీకృతం కావడంతో తమను గాలికి వదిలేశారని వాపోతున్నారు తాత్కాలిక ఉద్యోగులు. తాత్కాలిక ఉద్యోగులు గా పనిచేసిన డ్రైవర్, కండక్టర్లను ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులులో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ దిల్ సుఖ్ నగర్ డిపోలో పనిచేసిన తాత్కాలిక కార్మికులు డిపో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు: రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు

తమను ఇలా వాడుకుని వదిలేయడం భావ్యం కాదంటూ వారు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని అయినప్పటికీ కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. 

ఇకపోతే ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పనిచేశారు. రవాణా విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంలో అహర్నిశలు శ్రమించారు. అంతేకాదు ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ పట్టుదలతో ఉండటానికి కారణం కూడా తాత్కాలిక ఉద్యోగులేనని అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

తెలంగాణ రాష్ట్రంలో బంద్ ప్రభావం అంతా లేదనిపించేలా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పనిచేశారు. ఒకవేళ తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు లేకపోతే కేసీఆర్ ఎప్పుడో దిగివచ్చేవారని యూనియన్ నాయకులు ఆరోపించిన సంగతి తెలిసిందే. 

KCR Photo Gallery: ఆర్టీసి ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు... ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశం