హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును  60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.

ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ సీఎం కేసీఆర్  ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోల నుండి ఐదుగురు ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ ఆదివారం నాడు మధ్యాహ్న భోజనం చేశారు. ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చే విషయమై కార్మికులతో చర్చించారు.

Also read:ఆర్టీసీ కార్మికులతో ప్రారంభమైన కేసీఆర్ ఆత్మీయ సమావేశం

ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు 52రోజుల పాటు సమ్మె చేసిన కాలానికి జీతాన్ని కూడ చెల్లిస్తామని సీఎం చెప్పారు.ప్రతి ఏటా వెయ్యి కోట్లను బడ్జెట్‌లో ఆర్టీసీకి  కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నాలుగు మాసాల్లో ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Also Read:అన్న మాట ప్రకారం: ఆర్టీసీ కార్మికులతో ఆదివారం కేసీఆర్ భేటీ

మరో వైపు సెప్టెంబర్ మాసానికి చెందిన వేతనాన్ని డిసెంబర్ 2వ తేదీ లోపుగా  చెల్లించేలా ఆర్టీసీ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు  ప్రతి ఆర్టీసీ డిపోల్లో మహిళ కార్మికులకు కూడ సకల సౌకర్యాలను కల్పించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఆర్టీసీలో ఏ ఉద్యోగిని కూడ తీసివేయ్యమని ఆయన తేల్చి చెప్పారు. ప్రతి ఒక్క ఉద్యోగికి ఉద్యోగ భద్రతను కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి  ఎలా తీసుకు రావడంపై  చర్చించారు. ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వస్తే సింగరేణి సంస్థ మాదిరిగానే ఆర్టీసీ కార్మికులకు బోనస్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్టుగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు అంతేకాదు ఆర్టీసీలోని యూనియన్ల నేతల మాటలను నమ్మకూడదని ఆయన ఆర్టీసీ కార్మికులకు హితవు పలికారు.

ఆర్టీసీని కాపాడుకొనేందుకు సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు కష్టపడాలని ఆయన సూచించారు. ఆర్టీసీ యూనియన్ల మాటలను నమ్మి మోసపోవద్దని ఆయన చెప్పారు. ఆర్టీసీని కాపాడేందుకు తాను చివరి ప్రయత్నం చేస్తున్నట్టుగా కేసీఆర్ వివరించారు.

ఆర్టీసీ ఉద్యోగుల భద్రత విషయమై కూడ నిర్ణయం తీసుకొంటామని  హామీ ఇచ్చారు. అయితే ఈ విషయమై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులపై కంటే కండక్టర్లపైనే ఎక్కువగా కేసులు నమోదౌతున్న విషయాన్ని కండక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ఇక నుండి బస్సుల్లో ప్రయాణీకులు టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తే కండక్టర్లకు ఎలాంటి బాధ్యతలు లేకుండా చర్యలు తీసుకొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.