ఆర్టీసీ బస్సులోనే ఓ కండక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా,  తొర్రూరులో జరిగింది. 

తొర్రూరు : తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా, తొర్రూరులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులోనే ఓ కండక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గార్లపాటి మహేందర్ రెడ్డి (54) అనే వ్యక్తి ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాడు. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామం అతని స్వస్థలం. తొర్రూరులోని టీచర్స్ కాలనీలో సెటిల్ అయ్యాడు. మహేందర్ రెడ్డికి భార్య అరుణ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మహేందర్ రెడ్డి మూడు రోజులుగా సెలవులో ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత డిపోకి వచ్చాడు.

తను డ్యూటీ చేస్తానని చెప్పి రిజిస్టర్ లో పేరు కూడా రాయించుకున్నాడు. ఆ తర్వాత అతను ఇంకా ఎవరికీ కనిపించలేదు. డ్యూటీ వేసిన తర్వాత సిబ్బంది అతనికి ఫోన్ చేసినా.. స్పందన లేదు. ఈ క్రమంలోనే బస్సు డిపో ఆవరణ చివర్లో నిలిపి ఉన్న ఓ బస్సులో మహేందర్ రెడ్డి టవల్తో ఉరివేసుకొని చనిపోయి కనిపించాడు. ఇది గమనించిన కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అయితే మహేందర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా భార్య అరుణ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

బస్సులో రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకు వెళ్లిన ప్రయాణికుడు.. తీర్పు ఏమిచ్చారంటే..

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున హరిద్వార్‌లోని పతంజలి వెల్‌నెస్ సెంటర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మెయిన్‌పురికి చెందిన రాజీవ్ కుమార్ గత కొంతకాలంగా డిప్రెషన్‌ కారణంగా ఈ సెంటర్‌లో ఉంటున్నాడు. అంతకుముందు గురువారం నాడు కూడా అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, సమయానికి అతని భార్య చూడడంతో అతడిని ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసింది. 

శుక్రవారం తెల్లవారుజామున భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిమీద సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. భాద్రపద్ ఎస్ హెచ్ వో నితేష్ శర్మ మాట్లాడుతూ... అతని మృతికి సంబంధించిన ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్‌ దొరకలేదన్నారు. రాజీవ్ కుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించబడుతోంది. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.