RSP: బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ‘ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయం’
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారెక్కారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను స్వాగతించారు. తాను ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ మారుతున్నట్టు అంతకు ముందు మీడియాతో ఆర్ఎస్పీ చెప్పారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత మంది నాయకులతో కలిసి కేసీఆర్ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు ప్రతిపాదన చేశారు. ఇందుకు కేసీఆర్ అంగీకరించారు. మరుసటి రోజు బెహెన్ జీ మాయావతితో మాట్లాడి పొత్తును ఖరారు చేసుకుంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తాడనే ప్రచారం జరిగింది.
కానీ, బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ముందుకు సాగలేదు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు గులాబీ పార్టీలోకి వెళ్లారు. బీఆర్ఎస్‌లో చేరడానికి ముందు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తాను ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నట్టు చెప్పారు. ప్యాకేజీ తీసుకుని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు. ప్యాకేజీ తీసుకునేవాడి నైతే అధికార పార్టీలో చేరే వాడినని పేర్కొన్నారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ఆ ర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడు అని అన్నారు.