న్యూఢిల్లీ:  ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు బుధవారం నాడు బీజేపీలో చేరారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ లు బుధవారం నాడు బీజేపీలో చేరారు.

బుధవారం నాడు ఉదయం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి రేవూరి ప్రకాష్ రెడ్డి, రవీంద్రనాయక్ లు న్యూఢిల్లీ వెళ్లారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరారు.

ఉమ్మడి ఏపీ  రాష్ట్రంలో రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నుండి టీడీపీ అభ్యర్ధిగా పలు దఫాలు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో  వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో మాజీ మంత్రి రవీంద్రనాయక్ చేరాడు. ఆ తర్వాత టీఆర్ఎస్ తో విభేదాల కారణంగా ఆయన ఆ పార్టీకి దూరమయ్యారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, లక్ష్మణ్‌లు  జేపీ నడ్డాకు పరిచయం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు న్యాయం చేయడం లేదని రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.