టిడిపి వీడేందుకు తయారైన రేవంత్ రెడ్డి టచ్ లోకి బిజెపి నేతలు కూడా వచ్చారు. తెలంగాణలో విస్తరించేందుకు ఉవ్విళ్లూరుతున్న బిజెపి మాస్ లీడర్లను పార్టీలో చేర్పించుకునేందుకు గట్టి కసరత్తే చేస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి అధిష్టానం ఆ దిశగా కేడర్ బలం ఉన్న నేతలకు వల వేస్తోంది. ముఖ్యంగా బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా తెలంగాణ పై ఇంకా ఆశల్లోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో బిజెపి ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ రేవంత్ రెడ్డితో సుమారు 2గంటల పాటు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభాకర్ స్వయంగా రేవంత్ ఇంటికి వెళ్లి ఆయనతో రెండు గంటలపాటు అనేక అంశాలపై చర్చించారు. వారిద్దరి మధ్య వివరాలను ఇటు రేవంత్ కానీ, అటు ప్రభాకర్ కానీ వెల్లడించలేదు. కానీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

అయితే రేవంత్ ప్రతిపక్ష కాంగ్రెస్ లోకి వెళ్లే కంటే అధికారంలో ఉన్న తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రంలో ఇంకో టర్మ్ లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లడం కంటే బిజెపిలోకి వస్తే తెలంగాణలోనూ బలమైన శక్తిగా మారే అవకాశాలున్నాయని బిజెపి నేతలు రేవంత్ కు సూచించినట్లు చెబుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే సిఎం అభ్యర్థులుగా చెలామణి అవుతున్న దశలో ఆ పార్టీలోకి వెళ్లడం వల్ల రేవంత్ మైలేజీ పెరిగే కంటే తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా బిజెపి నేతలు ఆయనతో అన్నట్లు తెలిసింది. ఎన్ విఎస్ ఎస్ ప్రభాకర్ భేటీలో కూడా ఈ విషయమై చర్చ జరిగి ఉండొచ్చని రేవంత్ ముఖ్య అనుచరుడొకరు వ్యాఖ్యానించారు. గత ఐదారేళ్లుగా ఇటు బిజెపి, అటు కాంగ్రెస్ తోపాటు టిఆర్ఎస్ నుంచి కూడ రేవంత్ రెడ్డికి ఆహ్వానాలు అందాయని, అయినప్పటికీ ఆయన టిడిపిని వీడేందుకు సుముఖంగా లేరని చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తే టిడిపి పొత్తుల విషయంలో టిఆర్ఎస్ కు దగ్గర కావడం మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

ప్రభాకర్ తన వ్యక్తిగత విషయాల మీద డిస్కస్ చేసేందుకే రేవంత్ ను కలిశారని, ఇందులో రాజకీయ అంశఆలు ఏమాత్రం లేవని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి రేవంత్ లాంటి పాపులారిటీ ఉన్న నేతకు బిజెపి సైతం ఎందుకు వల వేయకుండా ఉంటుందని కొందరు రాజకీయ నేతలు అంటున్నారు.

ఇంకో విషయం ఏమంటే రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎబివిపి సంఘంలో పనిచేసిన విషయాన్ని కూడా బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు. మరి అందరి ఆహ్వానాలు ఎలా ఉన్నా రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటాడన్నదే కీలకం కానున్నది.

 

మరిన్ని కొత్త వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెంకయ్య నాయుడి ఆరోగ్యం బాగుంది..

https://goo.gl/A9SzB8