టీఆర్ఎస్ ను ఐఎస్ఐ తో పోల్చుతున్న రేవంత్ వల్లే పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో కలసివెళ్లాలని టీటీడీపీ నేతలు డిసైడ్ అయ్యారని వార్తలు షికారు చేస్తున్నాయి.అయితే దీనిపై రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు ఒక్క ముఖ్య నేత కూడా స్పందించలేదు. ఒక్క టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తప్ప.

ఐఎస్‌ఐ ఏజెంట్‌ తో కలవడం, కేసీఆర్‌తో కలవడం ఒక్కటేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ప్రధాన శత్రువు టీఆర్‌ఎస్‌ అని మరోసారి స్పష్టం చేశారు.

తెలంగాణ సమాజానికి ద్రోహం చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ పార్టీ లక్ష్యమని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ , టీఆర్‌ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడుతోందన్న వార్తలను ఆయన ఖండించారు.

కానీ, ఆ పార్టీలోని ఏ ఒక్క నేత కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించనేలేదు. అసలు ఆ పార్టీ నేతలు అధినేత బాబు కంటే రేవంత్ వల్లే పార్టీకి తెలంగాణ లో ఎక్కువ నష్టం జరుగుతోందని నసుగుతున్నారట.

తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రమణ కూడా రేపోమాపో కారు ఎక్కడానికి సిద్ధమయ్యారని వినికిడి. రీసెంట్ గా ఆయన తన పాత సహచరుడు ఎర్రబెల్లితో దీనిపై మంతనాలు కూడా జరపారట.

‘అసలు మా చంద్రబాబు ఎప్పుడూ తెలంగాణ లో పార్టీ పై ఆశలు వదిలేసుకున్నారు. కానీ, రేవంత్ మాత్రం తానే పార్టీకి దిక్కు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన వల్ల తెలంగాణ లో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది ’ అని ఓ తెలుగు తమ్ముడు వాపోతున్నాడు.