Asianet News TeluguAsianet News Telugu

విష వృక్షాలు విస్తరిస్తున్నా మౌనమేనా?

  • సిఎం కెసిఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ
  • బతుకమ్మ బోనాలు విలసిల్లాల్సిన చోట డ్రగ్స్,, పబ్స్ విస్తరిస్తున్నాయి
  • తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి
  • డ్రగ్ మహమ్మారి జడలు విప్పేవరకు మనం కళ్లు తెరవలేదు
  • గతంలో కేసులను నీరుగార్చినట్లే డ్రగ్స్ కేసును నీరుగార్చొద్దు
  • పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నది కాబట్టి కఠినంగా ఉండాలి
Revanth writes open letter to kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు టిడిఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను యదాతదంగా ప్రచురిస్తున్నాం.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి..

“బతుకమ్మలు..బోనాలతో పచ్చగా విలసిల్లాల్సిన మన తెలంగాణ సంసృతిలో క్లబ్బులు.. పబ్బులు అనే విషవృక్షాలు విస్తరిస్తుండటం తెలంగాణ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.. 430 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన మన భాగ్యనగరంపై మునుపెన్నడు ఎరగని మాదకద్రవ్యాల మచ్చపడటం సామాన్యులను కూడ కలిచివేస్తోంది. సొంత రాష్ట్రం సాధించుకున్నామన్న ఆనందం కూడ ఆవిరైపోతోంది.. ఈ నేపథ్యంలో మన భాగ్యనగరంపై పడిన మచ్చను శాశ్వితంగా చెరిపేసుకోవడం మన గురుతర బాధ్యత.. దీనికోసం బేధబావాలు చూపకుండా ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని విస్మరించి తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి వాస్తవాలను పట్టించుకోకుండా సమస్య మూలాలకు చికిత్స చేయకుండా గతంలో ప్రధానమైన కొన్ని కేసులను నీరుగార్చిన రీతిలోనే డ్రగ్స్ కేసును కూడ పక్కదారి పట్టిస్తే మన పిల్లల భవిష్యత్తులు నాశనం అవుతాయి.. భావితరాలు మనల్ని క్షేమించని పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి..”

హైదరాబాద్ లో వెలుగు చూసిన డ్రగ్స్ దందా ఒక సామాన్యమైన విషయం కాదన్నది మీకు తెలియనిది కాదు.. పాఠశాలలు.. కళాశాలలు.. సినిమాలు.. పబ్బులు.. ఐటి.. వ్యాపార రంగాలకు విస్తరిస్తున్న ఈ మహమ్మారిని పూర్తిగా అదుపుచేసి అణిచివేయడానికి ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవు.. వాస్తవానికి ఇలాంటి మహమ్మారుల రాకను ఆదిలోనే పసిగట్టి ప్రభుత్వానికి నివేదించాల్సిన నిఘాసంస్థలు డ్రగ్స్ మహమ్మారి జడలు విప్పెదాకా దాని జాడను పసిగట్టలేకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. సమాజాన్ని కనిపెట్టుకొని ఉండాల్సిన నిఘా సంస్థలను రాజకీయ వ్యవహారాలను పసిగట్టడానికి మాత్రమే పరిమితం చేసిన ఫలితానికి పర్యవసానం ఇది. విశ్వనగరంగా ఎదగాల్సిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు కూడ కళంకం తెచ్చిన వ్యవహారం ఇది.. ఇప్పటి వరకు కేవలం మాదకద్రవ్యాల వినియోగదారులను మాత్రమే విచారిస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో వేళ్లూనుకున్న డ్రగ్స్ మాఫీయా బుసలు కొడుతూ విచారణాధికారినే చంపుతామంటూ బెదిరించడం ఈ సమస్య తీవ్రతకు తార్కాణం. ఈ నేపథ్యంలోనే మీరు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం అయినప్పుడు నగరాన్ని కుదిపేస్తున్న మాదకద్రవ్య మహమ్మారిని గురించి ప్రస్తావిస్తారని, డ్రగ్స్ అంతానికి కేంద్రం సహాయాన్ని కోరుతారని కూడ మేము ఆశించాము. కానీ మీరు కేవలంమీ రాజకీయ ప్రయోజనాలకు పరిమితమైన అంశాలను గురించి మాత్రమే ప్రధానితో చర్చించడం దురదృష్టకరం.

వాస్తవానికి హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ వ్యవహారం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీ ప్రభుత్వమే వెల్లడించింది. డ్రగ్స్ కు సంబందించిన కోట్లాది రూపాయల లావాదేవీలు విదేశీ బ్యాంకులలో జరిగాయని, నగరానికి వస్తున్న మాదక ద్రవ్యాలు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని, ఆఫ్రికాకు చెందిన డ్రగ్స్ మాఫీయా నుంచి విచారణాధికారి అకున్ సబర్వాల్ కు బెదిరింపులు వచ్చాయని మీ ప్రభుత్వమే బయటపెట్టింది. ఈ లెక్కన చూస్తే విదేశాలలో ఉత్పత్తి అయి రాష్ట్రానికి చేరుకుంటున్న డ్రగ్స్ మూలాలను పెకిలించడానికి, విదేశీ బ్యాంకులలో డ్రగ్స్ కు సంబందించి లావాదేవీలు జరిగిన ఖాతాలను స్తంభింపచేయడానికి, బెదిరిస్తున్న అంతర్జాతీయ ముఠాల అంతుచూడడానికి రాష్ట్ర ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పరిధి ఏ మాత్రం సరిపోదు. ఈ వాస్తవాన్ని విస్మరించి కేవలం డ్రగ్స్ వినియోగదారులపై చర్యలు తీసుకున్నంత మాత్రన అసలు సమస్య పరిష్కారం అయ్యే అవకాశమే లేదు. దేశ స్థాయిలో మాదకద్రవ్యాలను అదుపుచేయడానికి, వాటికి సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకోవడానికి పనిచేస్తున్న నార్కోటిక్స్ విభాగం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(DRI), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సంస్థల సహకారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ఈ మహామ్మారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ పోర్స్ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో నార్కోటిక్స్, డిఆర్ ఐ, ఇడి సంస్థల అధికారులు, రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులతో కూడిన సిట్ ను ఏర్పాటుచేసి దానిద్వారా విచారణను సాగిస్తే డ్రగ్స్ దందాకు మూలమైన నేరస్థులు దేశ, విదేశాలలో ఎక్కడ ఉన్నా జుట్టుపట్టి లాక్కునిరావడానికి డ్రగ్స్ మూలాలను సమూలంగా తుడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా మీ ప్రభుత్వం అడుగులు వేయాల్సిందే.

బంధుప్రీతిని, రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి డ్రగ్స్ దందా నడుపుతున్న వారేవరైనా కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడ ఉంది. దీనిని విస్మరించి కేవలం డ్రగ్స్ వినియోగించే వారిని విచారించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు తెలియదని అనుకోలేము. అయినప్పటికి గతంలో కొన్ని కేసుల విషయంలో సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేసినప్పుడు దానిని పట్టించుకోకుండా ఆ కేసులను నీరుగార్చిన తరహాలోనే డ్రగ్స్ కేసును కూడ అటకేక్కిస్తామని అనుకుంటే భావితరాలు, తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షేమించదు. దేశంలో పంజాబ్ తర్వాత ఆ స్థాయిలో మాదకద్రవ్యాల లావాదేవీలు జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలోనే అన్న అపవాదు రాష్ట్రానికి వస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. ఈ నేపథ్యంలోనే మీకు తెలుగుదేశం పార్టీ తరుపున ఈ క్రింది చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.

 

మా డిమాండ్లు:-

• హైదరాబాద్ లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం గురించి నార్కొటిక్స్, డిఆర్ ఐ, ఇడి లకు తక్షణం సమాచారం ఇచ్చి సమస్య అంతానికి వారి సహకారం కోరాలి.

• ప్రస్తుతం ఎక్సైజ్, టాస్క్ పోర్స్ కే పరిమితమైన సిట్ స్థానంలొ నార్కొటిక్స్, డిఆర్ ఐ, ఇడి ప్రతినిధులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేయాలి.

• విషసంసృతికి మూలమౌతున్న క్లబ్బులు, పబ్బులు, అంతర్జాతీయస్థాయి ఈవెంట్లను నియంత్రించాలి.

• నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పబ్బులను శాశ్వతంగా మూసివేయాలి.

• జనవాసాల మధ్య నుంచి క్లబ్బులు, పబ్బులను తొలగించాలి.

• డ్రగ్స్ ను నియంత్రించే ప్రక్రియను నిరంతరం నిరవధికంగా కొనసాగించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కేంద్ర సంస్థలటో కలిపి ఏర్పాటు చేయాలి.

ఇది ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన సమయం. సొంత ప్రయోజనాలను, తాత్కాలిక ఉపయోగాలను పక్కనపెట్టి భావితరాల కోసం బాధ్యతాయుతంగా చర్యలను చేపట్టాల్సిన తరుణం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోతే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజాప్రయోజనాల కోసం, దెబ్బతింటున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవడం కోసం ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని తమరికి తెలియజేస్తున్నాము.

 

      (ఎ.రేవంత్ రెడ్డి)

             ఫ్లోర్ లీడర్, టిడిఎల్పీ

Follow Us:
Download App:
  • android
  • ios