Asianet News TeluguAsianet News Telugu

లవర్స్ డే కోసం రేవంత్ రెడ్డి ఎదురుచూపులు

  • ప్రేమికుల రోజు కోసం తెలంగాణ నేతల ఎదురుచూపులు
  • రాజకీయ సమీకరణాలు అప్పటినుంచే మారతాయని ఆశ
  • కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు వలసలపై దృష్టి
  • గూడు పదిలం చేసుకుంటున్న టిఆర్ఎస్
revanth waiting for lovers day

లవర్స్ డే కోసం ప్రేమికులు ఎదురుచూడడంలో అర్థం ఉంది కానీ రేవంత్ రెడ్డి ఎదురుచూడడం ఎందుకబ్బా అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. టిడిపి నేత రేవంత్ నిజంగానే లవర్స్ డే కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకోమాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు తెలంగాణ రాజకీయ నేతలు చాలా మంది, చాలా పార్టీలు ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. కారణమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

తెలంగాణ రాజకీయ పార్టీల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఏ నలుగురు నాయకులు కలుసుకున్నా, పక్క పార్టీల వారితో కలిసినా ఒకే చర్చ నడుస్తున్నది. అదేమంటే అన్ని చర్చలు కూడా ఫిబ్రవరి నెల చుట్టే తిరుగుతున్నాయి. అంటే తెలంగాణ రాజకీయ పరిణామాలు ఫిబ్రవరి రెండో వారం నుంచి కీలక మలుపులు తిరుగుతాయన్న అంచనాల్లో పార్టీల నేతలు మునిగిపోయారు.

ఫిబ్రవరి వరకు రాజకీయ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు, ఫిబ్రవరి తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులుంటాయి అని రేవంత్ తన సన్నిహితుల వద్ద కామెంట్ చేశారట. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతూనే ఇతర పార్టీల నుంచి టిడిపిలోకి వలసలు ఫిబ్రవరి తర్వాత పెరుగుతాయని రేవంత్ చెబుతున్నాడట.

ఇక కాంగ్రెస్ నేతలు సైతం ఫిబ్రవరి నెల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోక తప్పదని సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ఏడుగురు మంత్రులు, పదిహేను మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వీరంతా ఫిబ్రవరి తర్వాతే వస్తారేమోనని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చలు సాగుతున్నాయి.

ఇక బిజెపి సైతం తెలంగాణలో పాగా వేసేందుకు ఊవ్విళ్లూరుతున్నది. ఆ పార్టీ కూడా జంప్ జిలానీలపై భారీగానే ఆశలు పెట్టుకున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను బుట్టలో వేసుకునేందుకు అమిత్ షా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అలాగే పనిలోపనిగా టిఆర్ఎస్ నేతలకు కూడా వల వేస్తున్నారు అమిత్ షా. బిజెపి సైతం మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆరు నెలల తర్వాత వలసల జోరు కొనసాగుతుందని అంచనాల్లో ఉన్నట్లు పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.

ఇదిలా ఉంటే అధికార టిఆర్ఎస్ సైతం తన అంచనాల్లో తాను ఉంది. సిట్టింగ్ లు ఎవరూ గోడ దూకకుండా ఉండేందుకు సిఎం కేసిఆర్ మొన్న ఒక ప్రకటన చేశారు. సిట్టింగ్ లందరికీ సీట్లు అని ఆయన స్పష్టం చేశారు. దీంతో సిట్టింగ్ లు ఎవరూ వెళ్లకుండా కట్టడిచేసే యోచనలో టిఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీకి సినీ గ్లామర్ ను పెంచడం కోసం కొంతమంది సినీ ప్రముఖులను పార్టీలోకి తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ పరిణామాలు చూస్తుంటే చాలా మంది నేతలు ఒక పార్టీలో ఉంటూనే ఇంకో పార్టీతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కేడర్ లో చర్చలు సాగుతున్నాయి. ఈ ప్రేమాయణాలన్నీ లవర్స్ డే నుంచి వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది లవర్స్ డే తెలంగాణలో అనూహ్య మార్పులను తీసుకొస్తుందన్న ప్రచారం బలంగా జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios