ఏపీ, తెలంగాణల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మైన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. 

న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీతో తగాదాలకి తాము సిద్ధంగా లేరన్నారు అయితే.. రాష్ట్ర హక్కులపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడమన్నారు. జూన్ 23న జరగనున్న రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించాలని భావిస్తున్నట్టు తెలిపారు.

అవసరమైతే ఏపీతో చర్చలకు సిద్ధం

బనకచర్ల ప్రాజెక్టుపై అవసరమైతే తామే ముందడుగు వేసి ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానిస్తామని రేవంత్ చెప్పారు. ఒకరోజు కాదు, అవసరమైతే నాలుగు రోజులు అయినా కూర్చుని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలపై విస్తృతంగా చర్చిద్దామని అన్నారు. విభజన చట్టానికి అనుగుణంగా రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై విభజన స్పష్టత రావాల్సిన అవసరం ఉందని సూచించారు.

బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు

గోదావరి జలాల అంశాన్ని బీఆర్ఎస్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌గా వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ దాదాపు చచ్చిపోయిన పార్టీ అని, ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు 'సంజీవని'గా మారిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, సాగునీటి విషయంలో జరిగిన అన్యాయానికి కేసీఆర్, హరీష్ రావులే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు అడుగులు

2016లో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కోసం సర్వేలు జరిపేందుకు జీవోలు ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని, కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. అలానే అప్పటి సీఎం కేసీఆర్ గోదావరి వరద జలాలను ఏపీకి తరలించేందుకు అపెక్స్ కౌన్సిల్లో అంగీకారం తెలిపిన దాన్ని కూడా రేవంత్ మరోసారి గుర్తు చేశారు.

"హరీష్ చెప్పే అబద్ధాలకు దేవుడే ఆశ్చర్యపోతాడు!"

హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రేవంత్, అతని మాటలకు దేవుడే ఆశ్చ‌ర్య‌పోతాడని చ‌మ‌త్క‌రించారు. హరీష్ రావు అసహనంతో, అతి తెలివితో మాట్లాడుతున్నారని అన్నారు. "తాటి చెట్టులా పెరిగినా సరైన నాలెడ్జ్ లేని వ్యక్తి" అంటూ వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.

ప్రధాని మోదీకి చంద్రబాబు అవసరమైపోయారని, ఆయన మరోసారి ఏపీలో గెలవాలంటే గోదావరి జలాలు అవసరమవుతాయని అన్నారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలంటే బనకచర్ల అంశం అవసరం అవుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కారణంగా ఈ మూడు పార్టీలు కలసి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీపై సెటైర్లు

ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతూ, "కేసీఆర్ ట్యూషన్ మాస్టర్ అయితే, కిషన్ రెడ్డి కేటీఆర్‌కు లైజనింగ్ ఆఫీసర్ష అంటూ విమ‌ర్శించారు.