CM Revanth Reddy : కాంగ్రెస్ సర్కారులో తొలి ఉద్యోగం ఆమెకే... ఎవరీ రజనీ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ సిద్దమయ్యింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరుగ్యారంటీలతో పాటు ఇతర హామీలను నేరవేర్చే ఏర్పాట్లు చేస్తున్నార.
హైదరాబాద్ : తెలంగాణలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులుగా కొందరు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం ఆరు గ్యారంటీల అమలు ఫైలుపైను వుంటుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసారు.
ఇక ఎన్నికల సమయంలోనే ఓ దివ్యాంగురాలికి రేవంత్ ఉద్యోగ హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివినా అంగవైకల్యం కారణంగా తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వడంలేదని... ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించి అలసిపోయానని నాంపల్లికి చెందిన రజనీ టిపిసిసి చీఫ్ రేవంత్ కి తెలిపారు. ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న రేవంత్ అప్పటికప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరుగ్యారంటీలతో పాటే రజనికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే హామీనే మొదట నెరవేరుస్తానని ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ గ్యారంటీ కార్డుపై రజనీకి ఉద్యోగం అంశాన్ని కూడా చేర్చి స్వయంగా సంతకం చేసారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించగానే ఆరు గ్యారంటీల హామీ ఫైలుపై రేవంత్ సంతకం చేయనున్నారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇచ్చే ఫైలుపైనా రేవంత్ సంతకం చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి ఉద్యోగ నియామకం జరిగిపోనుంది.
Also Read CM Revanth Reddy : తెలంగాణ యుద్దాన్ని గెలిచివచ్చిన యోధుడికి వీరతిలకం దిద్దిన తల్లి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ఉద్యోగం తనకే దక్కుతుండడంపై దివ్యాంగురాలు రజనీ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉద్యోగావకాశం కల్పిస్తున్న కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ కు రజనీ కృతజ్ఞతలు తెలిపారు.