కెసిఆర్ నుంచి 2 వేల కోట్ల కాంట్రాక్టు కొట్టేసిన యనమల పరిటాలకు బీర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఎలా వచ్చింది?

ఆంధ్రా టిడిపి నేతల మీద తెలుంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి లబ్ది పొందుతున్నారని తీవ్రమయిన ఆరోపణ చేశారు. ముఖ్యంగా ఆంధ్రా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రధాన లబ్దిదారు అని కూడా రేవంత్ విమర్శించారు. నిన్న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిసి తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించిన రేవంత్ ఈ రోజు ఆంధ్రా టిడిపి డబుల్ గేమ్ రాజకీయాలను రచ్చకీడ్చారు.

అంతేకాదు, తన లకీనంబర్ 9 కి తగ్గట్టుగా డిసెంబర్ 9 నుంచి ఆయన రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నారు.ఆంధ్రా మంత్రులకు తెలంగాణ లో పనేంటని ప్రశ్నిస్తూ ఎపిటిడిపి నేతల బాగోతాలను ఆయన ఏకి పడేశారు.
‘యనమల రామకృష్ణకు కేసీఆర్ 2వేల కోట్లు కాంట్రాక్టు ఇచ్చాడు..ఆయన కేసీఆర్ మీద ఇగ వాల నిస్తాడా?’ అని రేవంత్ సంచలన వ్యాఖ్య చేశారు. పరిటాల పెళ్లికి కెసిఆర్ అంత ఉత్సాహంగా వెళ్లడం వెనక ఉన్న రహస్యాన్ని కూడా రేవంత్ వెల్లడించారు.హైదరాబాద్ లో పరిటాల సునీత రవికి బీర్లు తయారీ చేసే కంపెనీ లైసెన్స్ ఎట్లా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఎపి లో పయ్యావుల కేశవ్ ని ప్రజలు తిరస్కరించారు. ఆయనకు ఉన్నది ఏంది..? నేను తిట్టాల్సిన అవసరం లేదని అన్నారు. కెసిఆర్ కు పరిటాల పెళ్లిలో తెలుగుదేశం నేతలు బ్రహ్మరథం పట్టడం పట్ల అభ్యంతరం చెబుతూ తెలంగాణకు వస్తే చంద్రబాబు ఎవరూ పట్టించుకోకపోవడాన్ని రేవంత్ గుర్తు చేశారు.

‘మమ్ములను జైల్లో పెడితే కేసీఆర్ కి ఎపి టిడిపి నేతలు దండం పెడతారా? కేసీఆర్ ఏపీకి వెళ్తే ఎపి నేతలు అంతగా మర్యాద చెయ్యాల్సిన అవసరం ఏంటి? పరిటాల పెండ్లికి కేసీఆర్ వస్తే ఆయనకు వంగి వంగి దండం పెడతారు...చంద్రబాబు వస్తే కనీసం పట్టించుకునే వాళ్ళు లేరిక్కడ,’ అని రేవంత్ అన్నారు. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడుతున్నారు ఎపి నేతలని విమర్శించారు.
రేవంత్ చెప్పిన మరిన్ని విశేషాలు
ఢిల్లీ పర్యటన గురించి:
*టీఆరెస్ ఎమ్మెల్యేలమీద, ఎంపీల మీద కేసులు వెయ్యడానికి ఢిల్లీలో లాయర్ ని కలవడానికి వెళ్లాను.
* రాష్ట్రంలో కూలి పై, చందా పై ఢిల్లీలో కేసు వేస్తా, పండుగ తరువాత వేస్తా.
* టీఆరెస్ ప్రజాప్రతినిధులు 17 మంది కూలీల పేరుతో లంచాలు తీసుకున్నారు.
* ఎలక్షన్ కమిషన్ కు, ఏసిబి కి ఫిర్యాదు చేశాము..ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాము.
* కాంగ్రెస్ తో కలిసి గత కొన్ని రోజుల పని చేస్తున్నాము.సింగరేణి ఎన్నికలు, ప్రభుత్వ వ్యతిరేక పనుల పై కలిసి చేస్తున్నాం, ఇక ముందు కూడా పని చేస్తాం.
* పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తో కలిస్తే తప్పేంటి?
* నేను చంద్రబాబు అపాయింట్మెంట్ అడగలేదు.మీడియా లో వస్తున్న కథనం అవాస్తం.
* చంద్రబాబు విదేశీ పర్యటన తరువాత కలుస్తా..
తెలంగాణ రాజకీయాల మీద
* డిసెంబర్ 9వ తేదీ నుంచి పాదయాత్ర చెయ్యాలి అనుకుంటున్న.
* తెలంగాణ లో పార్టీలు లేవు... ప్రజలంతా రెండు గా విడిపోయారు. కేసీఆర్, కేసీఆర్ వ్యతిరేకులు.
* తెలంగాణ లో కేసీఆర్ పునరేకీకరణ జరుగుతది. అందులో నేను కీలక పాత్ర వహిస్తా.
* కేసీఆర్ ని మళ్ళీ సీఎం ను చెయ్యడానికి మేము రెడి గా లేము..
* సిద్ధాంతాలు చెప్పుకునే పార్టీ లు పక్క పక్కన ఉన్న రాష్ట్రాలలో పొత్తులు పెట్టుకుంటే తప్పులేనపుడు టిడిపి పొత్తులు పెట్టుకుంటే తప్పేముంది?
కాంగ్రెస్ పార్టీ తో సంబంధం గురించి
* కాంగ్రెస్ తో పొత్తుకు 1/3 అడుగుతున్నాము...2/3 వాళ్ళది..
* గతం లో మేము 52సీట్లకు మాట్లాడుకున్నాము.
* 2007 నుంచి నాకు చాలా పార్టీల నుంచి అవకాశాలు వచ్చాయి..
* చంద్రబాబు పొత్తుల పై ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు.
* నాపై వస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు నమ్ముత లేరు.
*బిజెపి పార్టీ ఎప్పుడో స్పష్టం చేసింది...ఎపి పొత్తు తెలంగాణ లో పొత్తులేదు అని.
* పొత్తుల పై చంద్రబాబు స్థానికంగా పరిస్థితులను బట్టి స్వతహాగా నిర్ణయాలు తీసుకోవాలని మాకు చెప్పాలి.
* తెలంగాణ లో బిజెపి లేదు...అందుకే దత్తాత్రేయ ను మంత్రి పదవి నుంచి తొలగించారు.
