హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశ్వనగరంలో పాలన బాలుడిపై కుక్కలుదాడి చేసే దాకా వచ్చిందని మండిపడ్డారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. కుక్కల దాడిలో బాలుడు చనిపోతే ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల పట్ల కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇది అని విమర్శించారు.
కుక్కలకు ఆకలి వేసిందని హైదరాబాద్ మేయర్ అంటున్నారని మండిపడ్డారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయిస్తామని మంత్రి చెబుతున్నారని విమర్శించారు. జరిగింది ఒక్కటైతే.. ప్రజాప్రతినిధులు చెబుతుంది మరొకటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ గుండాలు అక్రమించుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజను ఎమ్మెల్యేలను ఒదిలిపెట్టేది లేదని అన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఇక, హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో ఆదివారం ఐదేళ్ల బాలుడు ప్రదీప్ వీధి కుక్కలు దాడి చేయడంతో మృతిచెందాడు. దాడి తర్వాత బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో మూడు, నాలుగు వీధికుక్కలు.. బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ ఘటన తర్వాత హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల బెడద మళ్లీ తెరపైకి తెచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రభుత్వంపై, జీహెచ్‌ఎంసీపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు తమ ప్రాంతాల్లో వీధికుక్కల బెడదను అరికట్టాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఇది దురదృష్టకర సంఘటన అని అన్నారు. తాను నిజంగా బాధపడినట్టుగా చెప్పారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో వీధి కుక్కల బెడద అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. యానిమల్ కేర్ సెంటర్లు, యానిమల్ బర్త్ సెంటర్‌లు ఏర్పాటు చేశాం. వీధి కుక్కల గర్భనిరోధక ఆపరేషన్‌లను మేము క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. కానీ ఈ సంఘటనలు జరిగినప్పుడు అది అలజడిని, కోపాన్ని సృష్టిస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా వంతు కృషి చేస్తాం. జీవ వ్యర్థాల నిర్మూలనను కూడా పెంచాలి. నేను బిడ్డను తిరిగి తీసుకురాలేను కానీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మరోవైపు.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. నగరంలో 5.7 లక్షల కుక్కలు ఉంటే.. నాలుగు లక్షలకు పైగా కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు ఆమె చెప్పారు. కుక్కలను దత్తత తీసుకోవడం మంచి విషయమని.. కుక్కల ప్రేమికులు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లడం వల్ల వీధుల్లోకి వచ్చే వీధికుక్కల సంఖ్య తగ్గుతుందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం లేదని.. అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. బాలుడిపై కుక్కలు దాడి చేయడానికి గల కారణాల గురించి అడిగినప్పుడు.. కారణం స్పష్టంగా తెలియదని అన్నారు. కుక్కలు ఆకలితో ఉన్నాయనే అనుమానం ఉందని.. అవి ఆకలితో లేదా మరేదైనా కారణం చేత బాలుడిపై దాడి చేసి ఉండొచ్చనే చెప్పారు.
