Asianet News TeluguAsianet News Telugu

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు త్వరలోనే గెంటేస్తారని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ లో వర్గ పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు. 

Revanth Reddy says harish Rao will be sent out of TRS

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు త్వరలోనే గెంటేస్తారని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ లో వర్గ పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు. 

కేసీఆర్‌ కుటుంబం దిక్కుమాలిందని ఆయన అన్నారు. కాంట్రాక్టుల్లో మామ 10 శాతం, అల్లుడు రెండు శాతం వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం ఓ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. 

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుందని, మోడీ ప్రధాని, కేసీఆర్‌ సీఎం అయిన తర్వాతనే ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చారని గుర్తుచేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ముంపు గ్రామాల విలీనంపై చర్చ సందర్భంగా నాడు కేసీఆర్‌, కేశవరావులు పార్లమెంట్‌లోనే ఉన్నారని తెలిపారు. ముంపు మండలాలను ఏపీలో కలిపింది కాంగ్రెస్‌ పార్టీ అని ఎంపీ వినోద్‌ మాట్లాడం దారుణమని అన్నారు. 

యజమానులకు, పనివాళ్లకు మధ్య టీఆర్‌ఎస్‌లో పోరాటం జరుగుతోందని, ఏపీ ప్రత్యేక హోదాపై ఎవ్వరి వాదన వారిదేనని అన్నారు. లోక్‌సభ వేదికగా ఎంపీ కవిత ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారని ఆయన గుర్తు చేస్తూ హరీష్‌, వినోద్‌లు దాన్ని వ్యతిరేకించారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరి అడగడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 

ప్రత్యేక హోదా తీర్మానమే కాంగ్రెసు విషయంలో ఫైనల్ అని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తమ నిర్ణయాల్లో మార్పు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు పార్లమెంట్‌ తలుపులు మూసి, లైవ్‌ కట్‌ చేసి బిల్‌ పాస్‌ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని అన్నారు. 

ప్రత్యేక హోదాపై కేసీఆర్‌, కవిత, హరీష్‌లు ఒక్క మాట మీద ఉండరా అని అడిగారు. తనపై ఎంతమంది రావులు కేసులు పెట్టినా భయపడనని, చివరి వరకూ కేసీఆర్‌ దోపిడిని ప్రశిస్తూనే ఉంటానని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios