Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి మౌనం: టీ కాంగ్రెసులో ఏం జరుగుతోంది?

కాంగ్రెసులో చేరిన తొలినాళ్లలో రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కునే ధీటైన నాయకుడిని తానే అన్నట్లుగా వ్యవహరించారు.

Revanth Reddy's silence, because of...

హైదరాబాద్: కాంగ్రెసులో చేరిన తొలినాళ్లలో రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కునే ధీటైన నాయకుడిని తానే అన్నట్లుగా వ్యవహరించారు. పార్టీలో చేర్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డికి, ఆయన అనుచరులకు కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే, ఇప్పటి వరకు ఆ హామీలు ఏవీ అమలు కాలేదు. రేవంత్ రెడ్డి స్థానం కాంగ్రెసులో ఏమిటో కూడా తెలియడం లేదు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయనకు మధ్య విభేదాలు పొడసూపినట్లు మాత్రం ఆ మధ్య జరిగిన సంఘటనలు తెలియజేస్తున్నాయి. 

ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించిన తర్వాతనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. నిజానికి, తెలంగాణకు ముఖ్యమంత్రిని కావాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆ విషయం పలుమార్లు ఆయన మాటల్లోనే వెల్లడైంది. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడితే పార్టీని విజయ పథాన నడిపించి ముఖ్యమంత్రిని కావాలనేది ఆయన ఉద్దేశమని అంటారు. 

ఈ స్థితిలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అధ్యక్ష పదవిని ఇస్తామని రాహుల్ గాంధీ ఆయనకు చెప్పారని అంటారు. దాన్ని రేవంత్ రెడ్డి కాదన్నట్లుగా కూడా చెబుతున్నారు. అన్ని పదవులు రెడ్లకే ఉండడం వల్ల తెలంగాణలో సామాజిక సమీకరణాలను సాధించడం సాధ్యం కాదని రేవంత్ రెడ్డి ఆ పదవిని నిరాకరించినట్లు చెబుతున్నారు. 

ఈ స్థితిలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో మౌనంగా ఉండిపోతున్నారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని కూడా ఆయన రాహుల్ గాంధీతో చెప్పినట్లు సమాచారం. అయితే, కొత్త వచ్చిన నాయకులతో, పాత నాయకులకు పెద్దగా పొసగడం లేదనేది ఇటీవలి నాగం జనార్దన్ రెడ్డి గాంధీ భవన్ ఉదంతం కూడా తెలియజేస్తోంది. తన స్థానం ఏమిటో తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డి మౌనం వీడేట్లు లేరు. ఏమైనా, రేవంత్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం ఏ రూపంలో వాడుకుంటుందనేది తేలాల్సే ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios