Asianet News TeluguAsianet News Telugu

షర్మిల కేసీఆర్ వదిలిన బాణం, రాజన్న బిడ్డలు ఏలాలని కాదు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో పార్టీ పెట్టాలనే వైఎస్ షర్మిల ఆలోచనపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి స్పందించారు. షర్మిల కేసీఆర్ వదిలిన బాణమని ఆయన అన్నారు. షర్మిల పార్టీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని అడిగారు.

Revanth Reddy reacts on YS Sharmila Telangana politics
Author
Hyderabad, First Published Feb 9, 2021, 6:04 PM IST

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలనే వైఎస్ కూతురు షర్మిల ఆలోచనపై కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. షర్మిల జగనన్న వదిలిన బాణం కాదని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోరని, అందువల్ల కాంగ్రెసును దెబ్బ తీయడానికి కేసీఆర్ వదిలిన బాణమని ఆయన అన్నారు. 

ప్రపంచం నలుమూలలా వైఎస్ అభిమానులు ఉన్నారని, తెలంగాణలోనూ ఉన్నారని, అయితే షర్మిల పార్టీ పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఆదరించబోరని ఆయన అన్నారు. కాంగ్రెసు సీఎంగా వైఎస్ జనరంజక పాలన అందించారని ఆయన ప్రశంసించారు. 

రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలని, అంతేగానీ రాజన్న బిడ్డలు రాజ్యం ఏలాలని కాదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలపై వైఎస్ షర్మిల వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు షర్మిలతో పార్టీ పెట్టిస్తారా అని ఆయన ప్రశ్నించారు. అన్నపై కోపం ఉంటే షర్మిల ఆంధ్రలో చూసుకోవాలని ఆయన అన్నారు. షర్మీల పార్టీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు

వైఎస్ కూతురు షర్మిల రాజకీయ రంగ ప్రవేశంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు స్పందించిన విషయం తెలిసిందే. పార్టీలు పెట్టించడంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిట్ట అని ఆయన అన్నారు. ఎంపీ సీటు ఇవ్వలేదని అన్న జగన్ మీద కోపంతో షర్మిల పార్టీ పెడుతున్నారని ఆమె అన్నారు.

అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెడితే ఏం లాభమని ఆయన అడిగారు. జగన్ మీద కోపం తీర్చుకోవాలంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలని ఆయన అన్నారు షర్మిల పార్టీ పెడితే కేసీఆర్ కే లాభమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని విెచ్ అన్నారు. కాంగ్రెసు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారెవరూ షర్మిల పార్టీలోకి పోతారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల ఏం సమాధాన చెబుతారని విహెచ్ ప్రశ్నించారు.  

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని ఆయన అన్నారు. 

వైఎస్ మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని షబ్బీర్ అలీ అన్నారు. వైఎస్ కు కుటుంబ సభ్యులు వారసులు కారని, కాంగ్రెసు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే నిజమైన వారసులని ఆయన అన్నారు. తాను వైఎస్ మంత్రివర్గంలో పనిచేసినా వైఎస్ ను సీఎంను చేసింది మాత్రం కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios