రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలపై మోడీకి చిన్నచూపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.


న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల పట్ల నరేంద్ర మోడీకి చిన్న చూపు ఉందని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధమౌతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 

టీపీసీసీ చీఫ్ Revanth Reddy మంగళవారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని Narendra Modi చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. అన్ని ప్రాంతాలను సమభావంతో చూసేలా ప్రధాని ప్రసంగం ఉండాలన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అధమ స్థాయిలో మాట్లాడితే ఎలా ఉంటుందో ఇవాళ Rajya Sabha లో ప్రధాని మోడీ ప్రసంగం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానులు చట్టసభల్లో మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారోననే ఆసక్తి గతంలో ఉండేదని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇవాళ మోడీ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా అధమంగా ఉందన్నారు. పోరాటాలు చేసి మోడీ ప్రధాని కాలేదన్నారు. మేనేజ్‌మెంట్ స్కిల్స్ తో మోడీ ప్రధాని అయ్యారని ఆయన మండిపడ్డారు.

Gujarat సీఎంగా ఉన్న keshubhai patel ను తప్పించాల్సి వచ్చిన సమయంలో అరుణ్ జైట్లీని అడ్డు పెట్టుకొని అద్వానీని మేనేజ్ చేసి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారన్నారు. గుజరాత్ కు సీఎంగా అయ్యాక తన గురువైన అద్వానీకే నరేంద్ర మోడీ పంగనామాలు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నమ్మినవాళ్లను నట్టేట ముంచడంలో నరేంద్ర మోడీని మించిన వారెవరూ కూడా ఉండరన్నారు. 1997లో BJP ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించాలని కాకినాడ సమావేశంలో తీర్మానం చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ బీజేపీ తీర్మానం చేసిందన్నారు. ఈ తీర్మానానికి ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సాక్షేనని ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఏడు ఎంపీ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. అయితే ఇందులో తెలంగాణ నుండివ మూడు, ఆంధ్రలో నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకొందని చెప్పారు. 1999లోనే బీజేపీకి Telangana లో నాలుగు స్థానాల్లో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీష్ ఘడ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా బీజేపీ తెలంగాణ అన్యాయం చేసిందన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా మలిదశ ఉద్యమంలో వందలాది మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడానికి బీజేపీ కారణమైందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాకినాడ తీర్మాణానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఉంటే 1200 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొనే వారు కాదు కదా అని ఆయన ప్రశ్నించారు. 2004 ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని చెప్పారు. 2009 తర్వాత ఏపీలోని కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు ఒత్తిడి చేసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.తెలంగాణ ప్రజలను , తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలన్నారు. పార్లమెంట్ లో ఏ బిల్లుపైనైనా ఓటింగ్ జరిగే సమయంలో పార్లమెంట్ తలుపులు మాస్తారన్నారు. ప్రధానిగా ఉన్న వ్యక్తికి ఈ విషయం కూడా తెలియదా అని ఆయన ఎద్దేవా చేశారు.