టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఆరోపించారు. రాష్ట్రంలోని 50 లక్షల విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఒక పత్రిక కథనాలను కూడా ప్రచురించిందని చెప్పారు. రాష్ట్రంలోని 50 లక్షల విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈరోజు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓయూలో నిరుద్యోగ నిరసన దీక్షకు విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారని, ఆ నిరసనకు వెళ్దామనుకునే లోపే తనను హౌజ్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 

2021లో టీఎస్పీఎస్సీలో అర్హత లేని వారిని నియమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ విషయంపై హైకోర్టు జడ్జి సైతం ఆశ్చర్యపోయారని తెలిపారు. 2021లో దీనిపై పిటిషన్ వేస్తే.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఆరోపించారు. 

టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని గతంలోనే వార్తలు వచ్చాయని అన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుంటే.. పరీక్ష నిర్వహణలో అవతవకలపై అప్పుడే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనేది తమ నిర్దిష్ట ఆరోపణ అని చెప్పారు. రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఎత్తున దుర్మార్గం జరిగితే సీఎం కేసీఆర్ వెంటనే సిట్ వేస్తారని.. అందులో సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే వాళ్లను చేసి.. దానిని సమాధి చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. గతంలో సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు విషయంలో ఇదే జరిగిందని అన్నారు. 

Also Read: రాహుల్‌పై అనర్హత వేటు: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. వీధుల్లోకి వచ్చి పోరాడతాం: బీజేపీపై రేవంత్ ఫైర్

లక్షలాది మంది బాధితులు ఉన్న ఈ కేసులో కూడా ప్రభుత్వం సిట్ వేసి.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితులపై ఏసీబీకి సంబంధించి సెక్షన్‌‌లు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. సిట్‌లో ఏసీబీ అధికారులను చేర్చాలని సిట్ చీఫ్ శ్రీనివాస్‌ను కోరుతున్నట్టుగా తెలిపారు. 

2021లో టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని ఆరోపించారు. అనర్హులైన సభ్యులు నిర్వహించిన పోటీ పరీక్షల్లో లోపాలపై, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశాలన్నింటిపై సిట్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తే.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. ఓయూలో నిర్వహించే నిరుద్యోగ నిరసన దీక్షకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 29వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో జరిగినే నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొనేందుకు తమ పార్టీ నేతలం ఏర్పాట్లు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 27వ తేదీన అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో నిరుద్యోగ నిరసనను చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. 

ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలోని యూనివర్సిటీలలోని విద్యార్థులను కలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో తన పాదయాత్రను ఏప్రిల్ 6వ తేదీ వరకు వాయిదా వేసుకుంటున్నానని చెప్పారు. పూర్తి స్థాయిలో నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నట్టుగా చెప్పారు. అందుబాటులో ఉన్న టీ కాంగ్రెస్ ముఖ్య నేతలం సోమవారం ఢిల్లీ వెళ్లి.. ఈ విషయంపై ఈడీ, సీబీఐ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వారికి ఫిర్యాదు కూడా చేయనున్నట్టుగా చెప్పారు. ఏప్రిల్‌ రెండో వారంలో.. లక్ష మంది నిరుదోగ్య యువతతో హైదరాబాద్‌లో నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు.