కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టడం… అదానీ - మోడీ చీకటి స్నేహం పై నిలదీయడం.. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోదీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి’’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని అప్పీలకు కోర్టు 30 రోజుల సమయమిచ్చినప్పుడు.. అప్పటివరకు అనర్హతకు అవకాశమే ఉండదని అన్నారు. దేశం రాహుల్ గాంధీకి అండగా నిలబడుతుందని అన్నారు. తాము ఈ దుర్మార్గమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని చెప్పారు. 

దేశంలో వస్తున్న మార్పులను ఎదుర్కోవడానికి, అదానీ కుంభకోణం మీద చర్చ జరగకుండా ఉండటానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తుందని.. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని విమర్శించారు. దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని.. దీనిని కాంగ్రెస్ శ్రేణులు ఎదుర్కొంటాయని చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ఉందని.. తాను గృహ నిర్బంధంలో ఉన్నందున వెళ్లలేకపోతున్నానని చెప్పారు. తాను జూమ్ ద్వారా ఆ సమావేశానికి హాజరవుతానని తెలిపారు. 

Scroll to load tweet…


చరిత్రలో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారని.. ఏ నియంత కూడా శాశ్వత అధికారాన్ని అనుభవించలేదని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని అన్నారు.