రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యాక మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల అసామాన్యుడని, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల సమర్థుడని తెలిపారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని కాంగ్రెస్సే ఎమ్మెల్యేను చేసిందని, కానీ, ఆయన కాంగ్రెస్‌ను మోసం చేశారని ఆరోపించారు.
హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను బీఆర్ఎస్ నుంచి ఆశించి తుమ్మల నాగేశ్వర రావు భంగపడ్డారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ మారాలనే యోచనలో ఉన్నారు. దీంతో ఆయనను పార్టీలోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్న సంగతి తెలిసిందే. ఆయనను కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు.
తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు అవసరం అన్నారు. ఆయన కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితం కాదని తెలిపారు. ఆయన రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల సమర్థుడని చెప్పారు.
Also Read: మహిళా సంఘాల వీవోఏలకు సీఎం రాఖీ పండుగ కానుక.. జీతాలు పెంచుతూ నిర్ణయం
కాంట్రాక్టు పనులు చేసే ఉపేందర్ రెడ్డిని కాంగ్రెస్సే ఎమ్మెల్యే(పాలేరు ఎమ్మెల్యేను)ను చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఇప్పుడు అవినీతికి అలవాటు పడ్డాడని ఆరోపించారు. ఉపేందర్ రెడ్డి తుమ్మలను రాజకీయాల్లో లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఉపేందర్ రెడ్డి హస్తం పార్టీకి ఎక్కువగా అన్యాయం చేశారని ఆరోపణలు చేశారు.
