IAS Amrapali: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు.. స్మితా సబర్వాల్ పరిస్థితి ఏమిటీ?
కేంద్ర సర్వీసుల నుంచి తెలంగాణ సర్వీసులోకి వచ్చిన కాటా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఆమెను HMDA కమిషనర్‌గా, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్: యంగ్ ఆఫీసర్, అనతి కాలంలో ప్రజా ఆదరణను చూరగొన్న ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే ఆమెను కేంద్ర సర్వీసుల్లో నుంచి తెలంగాణకు రప్పించుకుంది. తాజాగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా, మూసీ నది అభివృద్ది కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
స్మితా సబర్వాల్ కూడా కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అనతి కాలంలో విశేష ఆదరణ పొందారు. ఆమె ప్రతిభను చూసి కేసీఆర్.. సీఎం సెక్రెటరీగా నియమించుకున్నారు. దీనితోపాటు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల పనులను పలుమార్లు ఆమె స్వయంగా పర్యవేక్షించారు. హెలిక్యాప్టర్‌లో తిరిగే ఏకైక ఐఏఎస్ ఆఫీర్ ఆమెనే అని కూడా ఆ మధ్య తరుచూ వినిపించేది.
కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన స్మితా సబర్వాల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పెద్దగా బయటకు కనిపించలేదు. కొత్త సీఎంను సాధారణంగా అధికారులు మర్యాదపూర్వకంగా కలుస్తుంటారు. స్మితా సబర్వాల్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ని కలువలేదు. దీంతో ఆమె డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లుతున్నాయనే వదంతులు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన స్మితా.. తాను తెలంగాణ కోసం పని చేస్తానని, తనకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని పేర్కొన్నారు. అయితే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం స్మితా సబర్వాల్‌ను వెయిటింగ్ లిస్టులో పెట్టినట్టు తెలుస్తున్నది. తాజాగా, పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, బాధ్యతల అప్పగింతలు జరిగాయి. కానీ, స్మితా సబర్వాల్ పేరు అందులో లేదు. దీంతో ఆమెకు మరింత ముఖ్యమైన పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనీ చర్చ జరుగుతున్నది.
ఇదిలా ఉండగా ఆమె ఈ రోజు తెలంగాణ సచివాలయానికి వెళ్లారు. ధనసరి అనసూయ సీతక్కను కలిశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్మితా సబర్వాల్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. సీతక్క, స్మితా సబర్వాల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.