హైదరాబాద్: కాంగ్రెసు రాజకీయం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి అప్పుడే అనుభవంలోకి వస్తున్నట్లుంది. ఆయనకు అప్పుడే సెగ తగులుతోంది. కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి పార్టీలో తనకు లభించే స్థానంపై చాలా ఊహించుకున్నట్లే ఉన్నారు.

అయితే, తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే భావనతో ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. దాంతో కాంగ్రెసు పార్టీలో ఆయనకు సెగ ప్రారంభమైంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తప్పు పట్టారు. 

టీమ్ లీడర్ (ఉత్తమ్ కుమర్ రెడ్డి) తనను పట్టించుకోవడం లేదని, ఆయనకు సరైన సలహాదారులు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ చాలా హామీలు ఇచ్చారని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. కానీ ఆయనకు రాహుల్ గాంధీ ఏ విధమైన హామీ ఇవ్వలేదని సుధాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. 

రేవంత్ రెడ్డి ఇటీవలే పార్టీలో చేరారని కూడా వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో లభించే ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తితో కాంగ్రెసులో చేరిన ఆయనకు ఇక్కడ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం లభించే సూచనలు కనిపించడం లేదు. 

ఎవరు కూడా షరతులు పెట్టి పార్టీలో చేరలేదని, సహనం వహించాలని, నాయకుల కన్నా పార్టీ ముఖ్యమని సుధాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేవనేత్తిన అంశాలపై పార్టీ కోర్ కమిటీ చర్చిస్తుందని కూడా ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సమైక్యాంధ్ర కోసం పోరాడిన చంద్రబాబు వెంట రేవంత్ రెడ్డి నడిచారని సుధాకర్ రెడ్డి అన్నారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో ప్రత్యేక స్థానం ఏదీ ఉండదని అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి అటు తెలుగుదేశం పార్టీకి కాకుండా, ఇటు కాంగ్రెసు పార్టీకి కాకుండా రేవంత్ రెడ్డి రెంటికి చెడిన రేవడి అవుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.