అతి త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న వేళ ఆ అంశంపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ మంత్రివర్గంలో గతంలో పనిచేసిన ఓ ముగ్గురు సీనియర్ నాయకులకు మరోసారి మంత్రులుగా అవకాశం రాదంటూ రేవంత్ జోస్యం చెప్పారు. వివిధ కారణాలు,  రాజకీయ సమీకరణల నేపథ్యంలో వారిని కేసీఆర్ పక్కనబెడుతున్నారని రేవంత్ వెల్లడించారు. 

మొదట తన మేనల్లుడు, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావుకు మరోసారి మంత్రిపదవి దక్కదని రేవంత్ అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ తన వర్గానికి చెందిన 30మంది అభ్యర్థులకు భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసినట్లు కేసీఆర్ కు తెలిసిందన్నారు. తనకు తెలియకుండా హరీష్ ఇలా చేయడంపై కేసీఆర్ గుర్రుగా వున్నారని రేవంత్ పేర్కొన్నారు. 

అంతేకాకుండా ఎన్నికల సమయంలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో హరీష్ మాట్లాడినట్లు కేసీఆర్ దృష్టికి వెళ్లిందన్నారు. ఇలా హరీష్ తనకు తెలియకుండా రాజకీయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన కేసీఆర్ అతడిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా వేటు వేయనున్నట్లు రేవంత్ వివరించారు. 

ఇక ఆదే బాటలో మరో ఇద్దరు కూడా కేవలం మాజీ  మంత్రులుగానే మిగలనున్నారని రేవంత్ అన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కడియం శ్రీహరికి గతంలో మాదిగ  సామాజికవర్గం కోటాలో మంత్రి అయ్యారని...ఈసారి ఆయనకు కేబినెట్ పదవి దక్కదని రేవంత్ తెలిపారు. అసలు మాదిగలకు ఈసారి మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చని రేవంత్ వెల్లడించారు. 

అలాగే హైదరాబాద్ కు చెందిన సీనియర్ నాయకులు నాయిని నర్సింహరెడ్డి కూడా ఈసారి మంత్రిమండలికి దూరం కానున్నారని రేవంత్ పేర్కొన్నారు.  కేసీఆర్  కేవలం అసమర్థులైన నాయకులకు మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు రేవంత్ విమర్శించారు.  

సంబంధిత వార్తలు 

హరీష్ కు మంత్రి పదవి రాదు..ఎందుకంటే: రేవంత్ రెడ్డి

పాక్‌తో యుద్దం...సార్వత్రిక ఎన్నికలు డౌటే: రేవంత్ రెడ్డి