పాకిస్ధాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ 45 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్దం అనివార్యమైతే ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

భారత సైనికులపై పుల్వామాలో జరిగిన దాడిని రేవంత్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై రేవంత్ మాట్లాడుతూ...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసలు సైనికులంటే గౌరవముందా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదుల దాడిలో 45మంది సైనికులు వీరమరణం పొందడంతో యావత్ దేశం దు:ఖంతో నివాళులర్పిస్తే సీఎం ఒక్కసారైనా అమర జవాన్ల త్యాగాల  గురించి గుర్తుచేసుకున్నారా? వారికి నివాళులర్పించారా? అని రేవంత్ ప్రశ్నించారు.  

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోతే  కేసీఆర్ రెండు సార్లు ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారు. కానీ దేశం కోసం చనిపోయిన జవాన్లకు  నివాళులర్పించే సమయం మాత్రం ఆయనకు లేదని రేవంత్ విమర్శించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులంటే కూడా గౌరవంలేదని రేవంత్ అన్నారు. పోచారంను పరామర్శించడానికి కేసీఆర్ వెళ్లిన సమయంలో పక్క గ్రామాల రైతులు  ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు.