హైదరాబాద్: కాంగ్రెసు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం శుక్రవారంనాడు లోకసభలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెసు సభ్యుల మధ్య స్వల్వ వివాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ దానిపై తక్షణ చర్చ జరగాలని కాంగ్రెసు సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. 

రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ఆయనకు బెయిల్ రాకుండా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు. అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని వారు స్పీకర్ ను కోరారు. కాంగ్రెసు ఎంపీల లేఖపై స్పందించిన స్పీకర్ సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. 

Also Read: చిటికెస్తే 10 వేల మంది దిగుతారు.. చూస్తావా: రేవంత్‌పై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

అదిలావుండగా, రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారాన్ని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు సభలో ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారాన్ని విమాన యాన శాఖ దృష్టికి తెచ్చారు. రేవంత్ రెడ్డిపై ఎయిర్ క్రాఫ్ట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ ప్రాపర్టీని డ్రోన్ కెమెరాలతో రికార్డు చేశారని ఆయన సభలో చెప్పారు. దానిపై ఫిర్యాదు రావడంతో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించుకోకూడదని ఆయన అన్నారు. నామా నాగేశ్వర రావు ఆ విషయం చెబుతున్నప్పుడు కాంగ్రెసు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

Also read: కారణమిదే: రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ల అసంతృప్తి

కేటీఆర్ కు చెందిన ఫాంహౌస్ దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాడనే ఆరోపణపై పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆ కారణంగా ఆయన పార్లమెంటుకు హాజరు కావడానికి వీలు లేకుండా పోయింది.