టీ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డే హీరో కాదని, తాను విజిల్ వేస్తే 10 వేల మంది హైదరాబాద్‌లో దిగుతారని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సైతం సత్తా లేదా అని ఆయన ప్రశ్నించారు.

గత కొద్దిరోజులుగా ఐదు రోజుల నుంచి కొందరు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరులు తనను శ్రీధర్ బాబు, దామోదర రాజ నర్సింహ కారు ఎక్కుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము నిజంగా కారు ఎక్కాలంటూ ఆపేదేవరని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

ఫేస్‌బుక్‌ను ఎలా వాడాలో తనకు తెలియదని, ఎఫ్‌బీలో ఫాలోవర్లు లేరని ఎలా చేసుకోవాలో కూడా తనకు తెలియదన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గురువారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఏ సమస్య వచ్చినా ఫీల్డ్‌లో ఉండే పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read:కారణమిదే: రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ల అసంతృప్తి

కాంగ్రెస్ పార్టీలో ఎవరి నియోజకవర్గంలోని వారైనా వారి సొంత డబ్బుతోను చట్టసభల్లో అడుగుపెట్టామన్నారు. ఎవరో నాయకులు డబ్బులు ఇస్తే తాము లీడర్లు కాలేదని.. కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్ బొమ్మలతో గెలిచినవారమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఎవరు పీసీసీ చీఫ్‌గా ఉన్నా వారి డైరెక్షన్‌లోనే తాము పనిచేస్తామని, తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్యేలమే ఉన్నా కాంగ్రెస్ కోసం కష్టపడుతున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి అనుచరులు చేస్తున్న ప్రచారం వల్ల కాంగ్రెస్ పరువు పోతోందని దీనిపై అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 

రేవంత్ రెడ్డి తనతో పాటు నాయకులందరినీ డిస్ట్రబ్ చేస్తున్నారని అందుకే మీడియా ముందుకు వచ్చానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెం.111ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆయన గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ భూములు వారి సొంత వ్యవహారాలని, వ్యక్తిగత విషయాలను పార్టీకి రుద్దొద్దని జగ్గారెడ్డి హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మేమంతా పుట్టామని, తాము కాంగ్రెస్‌ను పుట్టించలేదని పార్టీకి ఒక వ్యవస్థ ఉందని జగ్గారెడ్డి తెలిపారు. ఆరుగురు ఎమ్మెల్యేలం ప్రజా సమస్యలపై పోరాడాలా లేక రేవంత్ రెడ్డి అనుచరుల వ్యవహారంపై దృష్టి పెట్టాలా అని ఆయన ప్రశ్నించారు.  

ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే రేవంత్ రెడ్డే పీసీసీ, ఆయనే సీఎం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రులు వూరికే అయిపోరని, ఉద్యమాలు చేయాలి, ప్రజల్లో తిరగాలని ఈ విషయాన్ని సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.

Also Read:హీరోలమైనా లాబీయింగ్ చేసుకునేవాళ్ల ముందు జీరోలమే: జగ్గారెడ్డి

రేవంత్ రెడ్డి అంత హీరో అయితే టీడీపీలోనే ఉండి ఇంత ప్రచారం ఎందుకు చేసుకోలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనకు కూడా పీసీసీ, సీఎం కావాలని ఉందని ఆయన మనసులోని మాట బయటపెట్టారు. రేవంత్ అనుచరులు ఫేస్‌బుక్‌లో న్యూసెన్స్ ఆపకపోతే ఢిల్లీలో తేల్చుకుంటానని, పార్టీని ఎలా పైకి తీసుకురావాలో తనకు తెలుసునని ఆయన చెప్పారు.

హీరో అనిపించుకుంటున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎందుకు ఓడిపోయారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనపైనా ఎన్నో కేసులు పెట్టారని, కానీ తాను వ్యక్తిగత విషయాలను పార్టీకి రుద్దలేదని ఆయన గుర్తుచేశారు.

తనను కూడా ప్రభుత్వం ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. సమైక్యాంధ్రకు తాను మద్ధతుగా నిలబడితే ముగ్గురు ముఖ్యమంత్రులు పిలిచి జాగ్రత్తగా ఉండమన్నారని.. కానీ తాను ఎవరు చెప్పినా వినే రకాన్ని కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.