హైదరాబాద్:  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్  పార్టీకి చెందిన సీనియర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత అంశాలపై పార్టీకి ఎందుకు రుద్దుతున్నారని రేవంత్ రెడ్డిపై పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై చర్చించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also read:రేవంత్‌కు షాక్: బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కూకట్‌పల్లి కోర్టు

రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలోని  కేటీఆర్ లీజుకు తీసుకొన్న పామ్ హౌస్  111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించారని రేవంత్ రెడ్డి  ఆరోపించారు. ఈ ఫామ్‌హౌస్‌‌పై  డ్రోన్ కెమెరా ను ఉపయోగించిన కేసులో  ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కూకట్‌పల్లి కోర్టు కొట్టివేసింది.

జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహరంతో పాటు గోపన్ పల్లి భూముల విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి వ్యవహరంపై  కొంత అసంతృప్తితోనే ఉన్నారు.  వ్యక్తిగత  వ్యవహరాన్ని పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని  రేవంత్ రెడ్డిపై కొందరు సీనియర్లు బహిరంగంగానే మండిపడుతున్నారు.

గోపన్ పల్లి భూముల వ్యవహరానికి కౌంటర్‌ చేసే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి జన్వాడలో కేటీఆర్ పామ్ హౌస్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని  అంటున్నారు. అయితే ఏదైనా  అంశంపై ఆందోళన చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చించాల్సిన విషయాన్ని  ఆ పార్టీ నేతలు ఈ  సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

 111 జీవో విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మధ్యే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు నేతలు 111 జీవోకు మద్దతుగా మాట్లాడుతున్నారు. 111 జీవోను ఎత్తివేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరుతున్నారు. 

ఏదైనా అంశంపై పోరాటం చేయాలంటే పీసీసీ కార్యవర్గ సమావేశంలోనో, కోర్ కమిటీ సమావేశంలోనో చర్చించాల్సిన అవసరం ఉంది ఈ రకమైన  చర్చ లేకుండానే రేవంత్ రెడ్డి 111 జీవో విషయమై  పోరాటం చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రస్తావించారు. మరో వైపు పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డి అరెస్ట్‌ లింక్ చేసి సోషల్ మీడియాలో  పోస్టు చేయడంపై  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పుబట్టారు.

111 జీవోను ఎత్తివేయాలనేది  తన అభిప్రాయమని జగ్గారెడ్డి చెప్పారు. ఇదే విషయమై సీఎం ను కలిసి కోరుతానని చెప్పారు. మరో వైపు 111 జీవోకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాటం చేయడం ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.ఈ విషయాలన్నింటిపై చర్చించేందుకు కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని  జగ్గారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 

రేవంత్ రెడ్డి తీరుపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడ గతంలోనే  ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దామోదర రాజనర్సింహకు తాజాగా  వి. హనుమంతరావు, జగ్గారెడ్డి జత కలిశారు.