హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కార్యాలయంలో గాంధీ భవన్ లో సోమవారం జరిగిన సమావేశానికి తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ సమావేశం జరిగింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. కానీ తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూన శ్రీశైలంను పోటీకి దింపాలని ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 

మాజీ మంత్రి చిన్నారెడ్డి, వంశీచందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, ఇందిరా శోభన్ లతో పాటు 18 మంది పేర్లను కాంగ్రెసు నాయకత్వం పరిశీలిస్తోంది. వడపోత తర్వాత ముగ్గురు పేర్లను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తారు. 

సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, ఎఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ పాల్గొన్న్ారు. 

హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, వరంగల్ - నల్లగొండ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు ఫిబ్రవరి చివరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, బిజెపి ఈ ఎన్నికల విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావును, వరంగల్ - నల్లగొండ - ఖమ్మం సెగ్మెంట్ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని బిజెపి నాయకత్వం ప్రకటించింది.