రేవంత్ కు కాంగ్రెస్ లో రోజురోజుకూ మద్దతు పెరిగిపోతున్నది. టిడిపి వీడి కాంగ్రెస్ లో చేరడంతో రోజుకొకరు రేవంత్ రెడ్డిని కలిసి మద్దతు పలుకుతున్నారు. కొందరు నాయకులు రేవంత్ ఇంటికొచ్చి మద్దతు ఇచ్చి అభినందనలు తెలిపి పోతుంటే.. ఇంకొందరు నాయకులు తమ ఇంటికి పిలిపించుకుని అభినందనలు తెలిపి సన్మానాలు చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకొందరు నేతల ఇంటికి రేవంతే స్వయంగా వెళ్లి కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మరి ఇది బాగానే  ఉన్నా కొందరు టిఆర్ఎస్ నాయకులేమో రేవంత్ రెడ్డిని రహస్యంగా కలుస్తున్నారు. రహస్యంగా కలిసే టిఆర్ఎస్ నేతల సంఖ్య కూడా బారీగానే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంటనే ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రముఖ రాజకీయ నేతలందరినీ కలుస్తున్నారు. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డిని కలుసుకున్నారు. తన మద్దతుదారులైన వారందరినీ సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్యను కలుసుకున్నారు. పొన్నాల ఇంటికి వెళ్లి మరీ కలిసి ఆయన ఆశిస్సులు తీసుకున్నారు. పొన్నాల ఇంటికెళ్లిన సందర్భంలో అక్కడే లగడపాటి రాజగోపాల్ కూడా ఉండడం, అతడితో కలవడం కొంత వివాదం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే పొన్నాల ఇంటికి రేవంత్ వెళ్లిన సందర్భంలో మాటవరుసకే లగడపాటిని కలిశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  అయితే తాజాగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ రేవంత్ రెడ్డిని తన ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ సన్మానం కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రావడం కొత్త ఉత్సాహం నింపుతుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక అంతకంటే ముందే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరగణంతో రేవంత్ నివాసానికి తరలివచ్చి మద్దతు పలికారు. టిడిపి వీడి కాంగ్రెస్ లో చేరినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ కాంగ్రెస్ లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.

ఇక కొందరు టిఆర్ఎస్ నేతలు సైతం రేవంత్ రెడ్డిని కలుసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల మాదిరిగా ఓపెన్ గా కాకుండా రహస్యంగా కలుస్తున్నారట. కొందరు టిఆర్ఎస్ నేతలైతే రాత్రి 12 గంటల తర్వాత రేవంత్ ఇంట్లో ప్రత్యక్షమవుతున్నారని తెలుస్తోంది. ఇలా వరంగల్ కు చెందిన ఇద్దరు టిఆర్ఎస్ కీలక నేతలు రాత్రి 12 తర్వాత రేవంత్ ను కలిసి తాము కాంగ్రెస్ లోకి వస్తామన్న సంకేతాలు అందించినట్లు చెబుతున్నారు. అయితే ఎన్నికలు ఆరు నెలల ముందుగా వస్తామని వారు రేవంత్ తో చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.

మొత్తానికి తెలంగాణ తాజా రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హాట్ స్టార్ గా మారిపోయిండని అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నమాట.

 

ఆ విషయంలో కేసిఆర్ ను మించిన సిఎం దేశంలోనే లేడు

ఈ వార్తతోపాటు మరిన్ని తాజా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

https://goo.gl/4h1Qxh