కొడంగల్ లో కార్యకర్తల తో మాట్లాడిన రేవంత్ చంద్రబాబు కోర్టులోకి బంతిని నెట్టిన రేవంత్ బాబును కలిసిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్న రేవంత్

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి పార్టీ అధినేత చంద్రబాబును ఇరకాటంలో పడేసేలా మాట్లాడారు. తన నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్ లో మకాం వేసిన రేవంత్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకే తాను వ్యవహరిస్తానని, పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయనను కలిసి, ఆ తర్వాత కొడంగల్ లో కార్యకర్తలను కలుస్తానని చెప్పారు. మొత్తానికి రేవంత్ కు చంద్రబాబు అపాయింట్ మెంట్ వస్తుందా రాదా అన్న మీమాంస ఒకవైపు ఉండగా మరోవైపు రేవంత్ మరింత డోసు పెంచి మాట్లాడారు.

అయితే బాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత రేవంత్ కు అపాయింట్ మెంట్ ఇస్తే పార్టీ మరింత డ్యామేజీ అవుతుందన్న ఉద్దేశంతో టిడిపి నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబుతోనే మాట్లాడుకుంటా అని గతంలో రేవంత్ స్పష్టం చేశారు. టిడిపి తెలంగాణ మీటింగ్ లో మోత్కుపల్లితో జరిగిన చర్చలోనూ మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రేవంత్ స్పస్టం చేశారు. అయితే కొడంగల్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ చేసిన వ్యాఖ్యల విషయమై టిడిపి అధినేత చంద్రబాబుకు ఇరకాటం తప్పకపోవచ్చని అంటున్నారు.

ఒకవైపు టిడిపి టిఆర్ఎస్ పొత్తు నేపథ్యంలో రేవంత్ బాబును ఇరకాటంలో పడేలా మాట్లాడారు. తర్వాత కేసిఆర్ తో ఎపి మంత్రులు అంటకాగి ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారని కుండబద్ధలు కొట్టారు. తీరా మూడోసారి కూడా బాబును కలిసిన తర్వాతే మీతో మాట్లాడుతా అంటూ బాబు కోర్టులోకి బంతి విరిరారు రేవంత్. మరి దీన్ని బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.