Asianet News TeluguAsianet News Telugu

రిటైర్డ్ ఎస్పీని సైతం ముప్పు తిప్పలు పెట్టిన ఎమ్మార్వో నాగరాజు

కీసర తాహిసిల్దార్ నాగరాజు అక్రమాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. రిటైర్డ్ ఎస్పీ సురేందర్ రెడ్డిని నాగరాజు ముప్పు తిప్పులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సురేందర్ రెడ్డి మాట్లాడారు

Retired SP Surender Reddy makes allegations against MRO Nagaraju
Author
Hyderabad, First Published Aug 15, 2020, 5:07 PM IST

హైదరాబాద్: కోటీ 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు పట్టుబడిన నాగరాజుపై రిటైర్డ్ ఎస్పీ సురేందర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను నాగరాజు బాధితుడేనని ఆయన చెప్పారు. లీగల్ గా డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ లంచం తీసుకోకుండా నాగరాజు పనిచేయడని ఆయన అన్నారు. 

తవ్వుతున్న కొద్దీ నాగరాజు అక్రమాలు బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కరొక్కరే బయటకు వస్తున్నారు. పోలీసు అధికారి అయిన తనను కూడా నాగరాజు లంచం అడిగాడని, తన పరిస్థితి ఏలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని సురేందర్ రెడ్డి అన్నారు. డబ్బులు ఇవ్వకుండా నాగరాజు ఒక్క పని కూడా చేయడని ఆయన అన్నారు. 

గతంలో తాను సిఎస్, రెవెన్యు ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవోలకు   ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. అధికారులను మభ్యపెడుతూ నాగరాజు పదవిని కాపాడుకున్నాడని ఆయన అన్నారు. ఇటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అన్నారు. 2018లో 4 ఎకరాల స్థలాన్ని తాను కొన్నట్లు, దానికి పాస్ బుక్ ఇవ్వడానికి నాగరాజు లంచం అడిగాడని, లీగల్ గా డాక్యుమెంట్లు ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని అన్నాడని ఆయన అన్నారు.

నాగరాజు ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు బయటకు తీస్తున్నారు. నాగరాజు రూ.  150 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నాగరాజు నివాసంలో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రం నాగరాజుతో పాటు ఇతర నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, కోటీ 25 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన కీసర ఎమ్మార్వో నాగరాజు సంపాదించిన ఆస్తుల విలువ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. 28 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని అక్రమంగా ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా కోటీ 25 లక్షల లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ అధికారులకు చిక్కాడు. 

ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేయగా 28 లక్షల రూపాయల నగదు, 2 కిలోల బంగారు నగలు లభించాయి. మరో రెండు లాకర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదు శివారులో నాగరాజు పెద్ద యెత్తున భూముల క్రియవిక్రయాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. 

విఆర్ఎ నుంచి ఐదు లక్షల రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 28 ఎకరాల భూమికి పాస్ బుక్కు ఇస్తే 2 కోట్ల రూపాయలు ఇస్తామని బ్రోకర్లు నాగరాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శామిర్ పేటలో ఓ గెస్ట్ హౌస్ నిర్మించి ఇవ్వాలని కూడా నాగరాజు బ్రోకర్లను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. లంచం తీసుకుంటుడగా కీసర తాహసీల్దార్ నాగరాజ్ ను, అతనికి లంచం ఇచ్చి విలువైన భూమిని కొట్టేయడానికి ప్రయత్నించిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి అనుచరుడిని, దళారిని, వీఆర్ఎను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

మేడ్చెల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలో పూర్వీకుల నుంచి ఓ కుటుంబానికి 44 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. 1996లో 16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కులను ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులకు కల్పిస్తూ అప్పటి ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 28 ఎకరాలపై వివాదం కొనసాగుతూ వస్తోంది. రైతులు అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. 

ఆ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది. ఆ భూమిపై ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను వేసింది. దాన్ని చక్కబెట్టే బాధ్యతను ఓ పార్టీకి చెదిన సీనియర్ నాయకుడి అనుచరుడు అంజిరెడ్డి, ఉప్పల్ కు చెదిన దళారి శ్రీనాథ్ తీసుకున్నారు. తప్పుడు పత్రాలతో పాస్ పుస్తకాలు ఇప్పించేందుకు వ్యూహరచన చేశారు. అందుకు కీసర ఎమ్మార్వో నాగరాజ్ ను ఆశ్రయించారు. అందుకు అతను ఒప్పుకున్నాడు. 

అందుకుగాను కోటీ 10 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చేందుకు నాగరాజ్ ఇంటికి అంజిరెడ్డి, శ్రీనాథ్ శుక్రవారం సాయంత్రం వచ్చారు. అప్పటికే ఫిర్యాదులు రావడంతో నాగరాజ్ మీద ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఆ క్రమంలో లంచం తీసుకుంటుండగా నాగరాజ్ ను పట్టుకున్నారు. ఆ ముగ్గురితో పాటు రాంపల్లి వీఆర్ఎ సాయిరాజ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు నాగరాజ్ నివాసంలో మరో రూ.25 లక్షలు దొరికాయి.

Follow Us:
Download App:
  • android
  • ios