సీఆర్పీఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన ఉద్యోగ విరమణ పొందిన ఓ పోలీస్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇతడు తన లైసెన్స్ గన్ తో కాల్చుకుని అత్యంత దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా పరిగి కి చెందిన మాదగోని రాములు(60) హైదరాబాద్ జవహార్ నగర్ లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడు సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి రిటైరయ్యాడు. 

అయితే నిన్న హటాత్తుగా రాములు తన లైసెన్స్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో భార్యా, పిల్లలు లేని సమయం చూసి అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వీరి ఇంట్లోంచి భారీ శబ్దం రావడంతో పక్కింటివారు వచ్చి చూడగా అప్పటికే రాములు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. తుపాకీతో పాయింట్ రేంజ్ తలపై కాల్చుకోవడంతో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు.

అతడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు భార్య చంద్రకళ తెలిపింది. దీంతో శారీరకంగా నే కాకుండా మానసికంగా కుంగిపోయి తీవ్ర ఒత్తిడితో ఉండేవాడని తెలిపింది. దీనివల్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని ఆమె తెలిపింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం లను రపపించి పరిసర ప్రాంతాల్లో ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.