Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కాంగ్రెస్ కు చావుదెబ్బ

  • తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి బాధ్యతల నుంచి దిగ్విజయ్ తొలగింపు
  • రామచంద్ర కుంతియా కు బాధ్యతలు
  • దిగ్విజయ్ తొలగింపు శరాఘాతమే అంటున్న కాంగ్రెస్ నేతలు
  • కెసిఆర్ ను ఢీకొట్టే స్థాయి కుంతియాకు ఉందా అన్న అనుమానాలు

 

removal of digvijay from Telangna may affect revival of party

తెలంగాణ కాంగ్రెస్ కు మరో చావుదెబ్బ తగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ ను తొలగించి ఆర్.సి కుంతియాను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. దీంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్ స్టేచర్ తో పోలిస్తే కుంతియా ఏమాత్రం సరిపోడని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.

దిగ్విజయ్ సింగ్ తెలంగాణ రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రం నుంచే ఒంటపట్టించుకున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణలో పెద్ద నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ నాయకగణం టిఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని సుతిమెత్తగా వ్యహరిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ సర్కారు వైఫల్యాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా ఇంతకాలం దిగ్విజయ్ సింగ్ ఫోకస్ చేశారు. దిగ్విజయ్ అనేక సందర్భాల్లో తెలంగాణ సర్కారుపై ఆధారాలతో సహా విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ మాఫియా, మియాపూర్ భూముల కుంభకోణంపై దిగ్విజయ్ తెలంగాణ సర్కారును ఇరకాటంలోకి నెట్టారు. కెటిఆర్ పైనా, కెసిఆర్ పైనా దిగ్విజయ్ చేసిన విమర్శలు రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ సర్కారు వెంకయ్య నాయుడి కుటుంబానికి మేలు చేకూర్చిన విషయాన్ని దిగ్విజయ్ లేవనెత్తారు. దీంతో జవాబు లేని టిఆర్ఎస్ పార్టీ దిగ్విజయ్ మతి భ్రమించిందంటూ తిట్ల దండకం అందుకునే దాకా వచ్చింది పరిస్థితి. మొత్తానికి దిగ్విజయ్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ నేపథ్యంలో ఉన్నఫలంగా దిగ్విజయ్ ను పక్కన పెట్టి అధిష్టానం కుంతియాను తెరమీదకు తీసుకురావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే దిగ్విజయ్ కేవలం ఒక సామాజిక వర్గం వారిని భుజాన మోస్తున్నారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఇక కుంతియా నియామకం శాశ్వతమా? లేక తాత్కాలికంగానే ఉంచుతారా అన్నది ఇప్పట్లో చెప్పలేమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

దిగ్విజయ్ అంతటి స్టేచర్ ఉన్న నేతను తొలగించి కుంతియాను ఇంచార్జిగా ప్రకటించడం తెలంగాణ కాంగ్రెస్ కు మరో నష్టమైన నిర్ణయంగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. సోనియా, రాహుల్ వంటి నేతలకు సైతం దిగ్విజయ్ సలహాదారుగా పనిచేస్తున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ ఉద్ధండుడు కెసిఆర్ ను, ఆయన తనయుడు కెటిఆర్ తో తలపడేంత స్టేచర్ కుంతియాకు ఉందా అన్న అనుమానాలను సొంత పార్టీ వారే వ్యక్తం చేస్తున్నారు.

దిగ్విజయ్ సింగ్ ఆరునెలల ఆధ్యాత్మిక  పాదయాత్ర సెప్టెంబర్ లో ప్రారంభించబోతున్నారు. నర్మదా పరిక్రమ కోసం చేస్తున్న  ఈయాత్ర మధ్య ప్రదేశ్, గుజరాత్ లలో 3300 కిమీ సాగుతుంది.  ఈ కారణంచేతనే ఆయనను తెలంగాణా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిసింది. ఏమయినా ఇది తెలంగాణా కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే.

ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ కు ఈ నిర్ణయం శరాఘాతమే అవుతుందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఎపిలో ఇంకా కాంగ్రెస్ బతికి బట్ట కట్టే వాతావరణం కనిపిస్తలేదు. కానీ తెలంగాణలో కొద్దో గొప్పో పార్టీ బతికే అవకాశాలున్నా ఇటు తెలంగాణ పార్టీ అగ్ర నాయకత్వం లాలూచీతనానికి తోడు అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎపి పరిణామాలు తెలంగాణలోనూ నెలకొనే ప్రమాదముందని కేడర్ ఆందోళన చెందుతన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios