తెలంగాణ పదో తరగతి పరీక్షా పత్రాల లీక్‌కు సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సమాధానాలను చీటిల రూపంలో పంపేందుకే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు నిందితులు. 

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తెలంగాణ పదో తరగతి పరీక్షా పత్రాల లీక్‌కు సంబంధించి నిందితులు సమ్మప్ప, బందప్పలను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను ప్రస్తావించారు. నిందితులిద్దరూ తెలిసిన విద్యార్ధుల కోసం పేపర్ లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. తనకు ఇన్విజిలేటర్ డ్యూటీ లేకపోవడంతో ఆ బాధ్యతను బందప్పకు అప్పగించాడు సమ్మప్ప. ఈ క్రమంలో క్వశ్చన్ పేపర్ ఫోటో తీసి వాట్సాప్‌లో పెట్టాలని బందప్పకు చెప్పాడు సమ్మప్ప. దీంతో పరీక్షకు హాజరుకాని ఓ విద్యార్ధి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి సమ్మప్పకు పంపాడు బందప్ప. ఇక్కడే అతను పొరపాటు చేశాడు. ఒక గ్రూపులో పెట్టాల్సిన ప్రశ్నాపత్రాన్ని పొరపాటున మరో గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. వెంటనే అప్రమత్తమై డిలీట్ చేసే లోపే స్క్రీన్ షాట్లు తీసుకున్నారు గ్రూపులోని సభ్యులు. అయితే సమాధానాలను చీటిల రూపంలో పంపేందుకే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు నిందితులు. 

కాగా.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ క‌ల‌క‌లం రేపుతోంది. 10వ త‌ర‌గ‌తి తెలుగు ప్రశ్న పత్రం పరీక్ష మొదలైన మూడు నిమిషాలకే వాట్సాప్ గ్రూపుల‌లో చక్కర్లు కొట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరు పరిసర ప్రాంత పరీక్షా కేంద్రాల్లో జరిగినట్లుగా స‌మాచారం. ఈ రోజు హిందీ ప‌రీక్ష పేప‌ర్ సైతం లీకేజీ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యంపై స్పందించిన బాలల హక్కుల సంక్షేమ సంఘం.. పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించ‌డంతో పాటు బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది. 

ALso REad:10వ తరగతి ప్రశ్నాపత్రాల లీక్ పై సమగ్ర విచారణ జరిపించాలి.. : బీహెచ్ఎస్ఎస్

పరీక్షకు హాజరైన లక్షలాదిమంది విద్యార్థులు ప్రశ్నాపత్రం లీక్ జరిగిందనే అనుమానంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. గుండు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ లు డిమాండ్ చేశారు. నిన్న (సోమ‌వారం) తెలుగు ప్రశ్నాపత్రం సంఘటన మరువక ముందే ఈ రోజు హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ లో దర్శనం ఇవ్వడం తో అసలు ఏం జరుగుతుందో అని విద్యార్థులు వారి తల్లితడ్రులు ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ల ఆధ్వర్యంలో నిఘా కమిటీ నియమించి నిరంతరం పర్యవేక్షించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరుతుంది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మకుండా ఆత్మవిశ్వాసంతో సిద్ధమై పరీక్షలు రాయాల‌నీ, తల్లితండ్రులు కూడా తమ పిల్లలకు ధైర్యం చెప్తూ వారిలో విశ్వాసాన్ని భరోసాను కలిగించాలని వారు కోరారు.