మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తి డబ్బు కోసం ఓ మహిళను బలి తీసుకున్నాడు. పొలం అమ్మిన డబ్బు విషయంలో తలెత్తిన గొడవతో అతను ఆ దారుణానికి ఒడిగట్టాడు. భర్త, కూతుళ్లతో కలిసి బైక్ మీద వెళ్తున్న సమయంలో వారిని వాహనంతో ఢీకొట్టాడు. ఆ తర్వాత వాహనాన్ని మీదికి ఎక్కించి మహిళను చంపేశాడు. 

ఘటనలో గాయపడిన ఆమె భర్త, కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుననారు. జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. బాలానగర్ మండలం మాచారం గ్రామానికి చెందిన యాదయ్య (41) షాద్ నగర్ లో ఉంటున్నాడు. యాదయ్య తల్లికి, ఆమె ముగ్గురు చెల్లెళ్లకు కలిపి జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఎకరం ఎనిమిది గుంటల పొలం ఉంది.ఆరు నెల క్రితం యాదయ్య ఆ భూమిని రూ.80 లక్షలకు విక్రయించాడు. 

అందులో తమకు వాటా ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగారు. అయితే అతను అందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం  యాదయ్య తన భార్య శైలజ (35), కూతురు నిహారిక (15)లతో కలిసి బైక్ మీద నవాజ్ పేట మండలం కారుకొండలో ఓ శుభకార్యానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి షాద్ నగర్ బయలుదేరారు.

మహబూబ్ నగర్ లోని ఏనుగొండలో ఉంటున్న నర్సింహులు వారిని సరుకు రవాణా వాహనంతో వెంబడించాడు. మాచారం శివారులో వెనక నుంచి బైక్ ను వాహనంతో ఢీకొట్టాడు. దీంతో బైక్ మీద ఉన్న యాదయ్య లేచి పరుగు తీశాడు. కింద పడిన శైలజ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగా నర్సింహులు తన వాహనాన్ని కొద్దిగా వెనక్కి తీసుకుని మళ్లీ ఢీకొట్టాడు. కింద పడిన శైలజ పైనుంచి వాహనాన్ని నడిపించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఆ తర్వాత వాహనాన్ని అక్కడే వదిలేసి నర్సింహులు పారిపోయాడు. గాయపడిన యాదయ్య, నిహారికలను స్థానికులు షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. పొలం అమ్మిన డబ్బు విషయంలో తమ సమీప బంధువులే వాహనంతో ఢీకొట్టి హత్య చేసేందుకు యత్నించారని యాదయ్య పోలీసులకు చెప్పాడు.