హైదరాబాద్ కోకాపేటలో రెండో విడత భూముల వేలం కొనసాగుతుంది. నియోపొలిస్ లే అవుట్‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ కోకాపేటలో రెండో విడత భూముల వేలం కొనసాగుతుంది. నియోపొలిస్ లే అవుట్‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు జూలై 31 లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ప్లాట్ సైజులు మూడు ఎకరాల నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఉంటాయి. ఎకరానికి కనీస అప్‌సెట్ (అత్యల్ప ఆమోదయోగ్యమైన అమ్మకపు ధర) ధర రూ.35 కోట్లుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. అయితే ఈరోజు ఉదయం తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. ఫ్లాట్లు అంచనాలకు మించి ధర పలికాయి.
నాలుగు ప్లాట్ల వేలంలో అత్యధికంగా ఒక ఎకరం దాదాపు రూ. 72 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 51 కోట్లు పలికింది. గజం సరాసరి రూ. 1.5 లక్షలు పలికింది. మొత్తంగా నాలుగు ప్లాట్ల వేలంలో రూ. 1,532.5 కోట్లు పలికాయి. ఇక, ప్రస్తుతం 10,11,14 ప్లాట్లకు వేలం కొనసాగుతుంది.
గతంలో 2021 జూలైలో నియోపోలిస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60 కోట్లను తాకింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,000 కోట్లు సంపాదించింది. ఫేజ్ 1లో దాదాపు 49 ఎకరాలు విక్రయించగా.. ఎకరం అప్‌సెట్ ధరను 25 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈరోజు జరిగే వేలం ద్వారా మరో రూ. 2,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇక, నియో పొలిస్‌తోపాటు గోల్డెన్ మైల్ పేరుతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో భూములు కొనుగోలుకు విపరీతమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.