భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెలామణిలో ఉన్న రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెలామణిలో ఉన్న రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించింది. ప్రజలు రూ. 2,000 నోట్లను 2023 సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని లేదా ఇతర నోట్లలోకి మార్చుకునేందుకు అవకాశం కలిపించింది. రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టుగా ఆర్‌బీఐ నుంచి ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ నోట్లను కలిగి ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వరకు సమయం ఉన్నప్పటికీ.. ముందు జాగ్రత్తగా ఇప్పుడే నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే పలువురు ఏటీఎం సెంటర్లలోని క్యాష్ డిపాజిట్ మెషీన్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను అక్కడ డిపాజిట్ చేస్తున్నారు. మరికొందరు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల బ్యాంకు అధికారులు మాత్రం ఇప్పుడు కాదని.. మళ్లీ రావాలని చెప్పడంతో జనాలు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
Also Read: Note Ban: ఏడేళ్లలోనే రూ. 2000 నోట్లను ఆర్బీఐ ఎందుకు రద్దు చేస్తున్నది? వివరణ ఏం ఇచ్చింది?
ఈ క్రమంలోనే ఏటీఎంలో కూడా విత్ డ్రా చేస్తున్నవారికి 2 వేల రూపాయలు నోట్లు వస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో పలుచోట్ల ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. నిన్నటి వరకు ఏటీఎంలో రాని 2 వేల రూపాయల నోట్లు.. ఇప్పుడు విత్ డ్రా చేస్తుంటే రావడంతో వాటిని మళ్లీ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. అయితే రెండు వేల నోట్ల ఉపసంహరణను సామాన్య ప్రజానీకం నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అయితే మెజారిటీ ప్రజానీకం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
