కేసిఆర్ బుట్టలో పడుతున్నావు పవన్

First Published 2, Jan 2018, 1:31 PM IST
Ravanth advises janasena Pawan against falling into  KCR trap
Highlights
  • కేసిఆర్ 24 గంటల విద్యుత్ అంతా మాయ
  • కేసిఆర్ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయితావు జాగ్రత్త
  • విద్యుత్ రఘు రాసిన పుస్తకం చదువు.. నేను పంపుతా

ప్రగతిభవన్ లో సోమవారం జరిగిన కేసిఆర్, పవన్ సమావేశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగుతోంది. ఆ సమావేశం తర్వాత కేసిఆర్ ను పవన్ పొగుడుతూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసిఆర్ అనుకూల రాజకీయ నేతలు ఆనందం వ్యక్తం చేస్తుండగా కేసిఆర్ వ్యతిరేక నేతలంతా ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ సమావేశంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయనేమన్నారో చదవండి.

కేసీఆర్ మాయలో పవన్ కల్యాణ్ పడ్డారు. సోనియా గాంధీ ఉదారత వల్లే మిగులు విద్యుత్. విభజన సమయంలో ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన ఏపీ, తెలంగాణకు పంచారు. విద్యుత్ కూడా అలాగే కేటాయించి ఉంటే తెలంగాణకు 42 శాతమే వచ్చి ఉండేది. సోనియా చొరవతో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. దీనివల్ల 54 శాతం విద్యుత్ తెలంగాణకు వచ్చింది. రాష్ట్ర విభజన సమయం 6,570 మెగావాట్లు తెలంగాణకు వచ్చింది. జైపూర్, భూపాలపల్లి, జూరాలలో కాంగ్రెస్ ప్రారంభించిన ప్లాంట్లు 2015లో ఉత్పత్తి ప్రారంభించాయి. ఇది 2,400 మెగావాట్లు ఉంది. ఉదయ్ స్కీం కింద గృహాలకు కేంద్రమే విద్యుత్ ఇస్తోంది. దేశంలో ఎక్కడా కరెంట్ కోతలు లేవు. కేసిఆర్ కు శ్రమ లేకుండానే ఈ విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. సమస్య తీరింది. కేంద్రం నుంచి కేటాయింపులు, కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులు, ప్రయివేటు కొనుగోళ్లు ఈ మూడింటి ద్వారానే మిగులు విద్యుత్ ఉత్పత్తి తెలంగాణలో సాధ్యమైంది తప్ప.. కేసిఆర్ కష్టం ఇందులో ఈసమంతా కూడా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అన్నింటిలో మతలబు ఉన్నది ప్రయివేటు విద్యుత్ కొనుగోళ్లు అన్న అంశంలోనే. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ కొనేవాళ్లు లేక ప్రైవేటు ప్లాంట్లు దివాళా తీస్తున్నాయి. మూతపడుతున్నాయి. ప్రయివేటు విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో సమైక్య ఉద్యమాలు చేసిన నాయకుల విద్యుత్ సంస్థలు మూసివేత దిశగా ఉన్నాయి. రైతులకు 24 గంటల కరెంట్ ముసుగులో కేసిఆర్ ఈ ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేస్తున్నారు. ముడుపులిచ్చి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంతో ప్రైవేటు ప్లాంట్ల నుంచి అడ్డగోలుగా విద్యుత్ కొంటున్నారు. కొనుగోలు లేక దివాళా తీసిన ప్రయివేటు కంపెనీలకు మేలు చేకూర్చేందుకు ఈ కొత్త 24 గంటల వ్యవసాయ విద్యుత్ నాటకానికి తెర లేపారు. వారిచ్చే ముడుపులు తీసుకుని ఈ దందా జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కు నిజంగా తెలంగాణలో 24 గంటల విద్యుత్ గురించి నిజా నిజాలు తెలుసుకోవాలనుకుంటే విద్యుత్ రఘు రాసిన పుస్తకాన్ని చదవాలి. పవన్ కు నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారి ద్వారా  ఈ పుస్తకాన్ని పవన్ కు పంపిస్తా. ఆయన తెలంగాణలో జరుగుతున్న దోపిడీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసిఆర్ మాయ మాటల మత్తులో చేసే దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ ను వాడుకునే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దోపిడీకి మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండకండీ. పవన్ సంపూర్ణ సమాచారం పరిశీలిస్తే బాగుంటుంది. ఆర్భాటపు ప్రచారం.. అందమైన ప్రచారం.. దానికి పవన్ కళ్యాణ్ ఫిదా అయి మాట్లాడడం శోచనీయం.

రైతులు తొమ్మిది గంటల పాటు పగటి పూట విద్యుత్ మాత్రమే అడుగుతున్నారు. కానీ.. 24 గంటల కరెంటు అడగడంలేదు. కేసిఆర్ రైతుల ముసుగులో ప్రయివేటు విద్యుత్ కంపెనీల ముడుపులు తీసుకుని విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. 28వ తేదీనాడు పవన్ ని కేటీఆర్ ఎనిగ్మా అన్నాడు. దానిని తెలుగులో చెప్పాలంటే అపరిచితుడని అర్థం. మరి అలాంటి వారి కుటుంబాన్ని పవన్ పొగడ్తలతో ముంచెత్తడం సమంజసమేనా?

loader