అప్పుడు జగన్ వల్ల దూరం: ఇప్పుడు యాంకర్ రాణి రుద్రమ దేవి రెడీ

Rani Rudrama Devo may contest elections
Highlights

యాంకర్ రాణి రుద్రమ దేవి గుర్తుండే ఉంటారు. ఆమె యాంకర్ గా ప్రసిద్ధరాలు మాత్రమే కాకుండా గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించి వెనక్కి తగ్గారు. రాష్ట్ర విభజన కారణంగా ఆమె వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు

హైదరాబాద్: యాంకర్ రాణి రుద్రమ దేవి గుర్తుండే ఉంటారు. ఆమె యాంకర్ గా ప్రసిద్ధరాలు మాత్రమే కాకుండా గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించి వెనక్కి తగ్గారు. రాష్ట్ర విభజన కారణంగా ఆమె వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆమె ఏ పార్టీలో చేరుతారు, ఆమెకున్న ప్రత్యామ్నాయాలేమిటనే  చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో రాణి రుద్రమ టిన్యూస్ సంస్థలో పనిచేశారు. అంతకుముందు ఆమె ఈటీవీ, సాక్షి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెళ్లలో పనిచేశారు.

తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో 2010లో తెలంగాణ భవన్ లో టిన్యూస్ ప్రారంభమైంది. ఆ సంస్థలో రాణి అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో టిన్యూస్ వదిలేసి  క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి వైసిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధపడ్డారు. అందుకు ఆమెకు జగన్ నుంచి హామీ లభించడమే కాదు టికెట్ల కూడా ప్రకటించారు. నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమెను నియమించారు.

రాష్ట్ర విభజన జరిగిపోవడం, దానికి ముందు జగన్ తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకోవడం వంటి కారణాలతో ఆమె వెనక్కి తగ్గారు. అంతేకాకుండా వరంగల్ జిల్లా కేంద్రంలో తాను వైసిపిని వీడుతున్నట్లు రాణి ప్రకటించారు. రాజీనామా లేఖను జగన్ కు పంపించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మీడియాలోనూ కనిపించలేదు. ఆ సమయంలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టినట్లు చెబుతారు. త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాణి రుద్రమ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పోటీ చేస్తారా? లేక గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని ఎంపి లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారా అనే విషయంపై చర్చ సాగుతోంది. రానున్న 2019 ఎన్నికల్లో కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి నుంచి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. ఇప్పటికే జన సమితి నేతలతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది. 

రాణి రుద్రమకు టిఆర్ఎస్ తో పడడం లేదని తెలుస్తోంది. మరో వైపు 20 ఏళ్ల క్రితం భువనగిరికి చెందిన నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి నెలకొల్పిన యువజన సంఘాల సమితిని రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. యువ తెలంగాణ పార్టీగా ఒకవేళ ఏర్పాటైతే ఆ పార్టీ తరుపున రాణి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. 

రాణి రుద్రమ రెడ్డి మీడియాను వదిలిన తర్వాత అద్భుతమైన బతుకమ్మ పాటను రాసి పాడారు. అప్పటి వరకు టివీల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ పూర్తి నిడివి బతుకమ్మ పాటలు లేవు. రాణి రుద్రమ రాసి పాడిన బతుకమ్మ పాట జనాల్లో ప్రజాదరణ పొందింది.

loader