రామోజీ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు... ప్రధాని మోదీ సంతాపం
మీడియా రంగంలో రామోజీ చెరగని ముద్ర వేశారని ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు. అనారోగ్యం బాధపడుతూ శనివారం తెల్లవారుజామున రామోజీరావు కన్నుమూయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనెప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. రామోజీరావు మరణం పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు...
Ramoji Rao Passed away: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షా, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలుగు అగ్ర కథానాయకుడు, మెగా స్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు....
‘‘శ్రీ రామోజీ రావు గారు మరణించడం చాలా బాధాకరం. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడాయన. జర్నలిజం, సినీ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన్ను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘‘ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు....దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి...ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. రామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు... నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి.’’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమేనని కొనియాడారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారని కీర్తించారు. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తుచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా చేశారన్నారు.
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.