రామోజీరావు కన్నుమూత.. వెంకయ్య నాయుడు విచారం
ఈనాడు గ్రూప్ ఛైర్మన్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు అస్తమించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు పత్రిక, మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా ఆయన అందరికీ సుపరిచితులే. రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇకలేరు. కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన... శనివారం తెల్లవారుజామున కన్నమూశారు. ఈ నెల 5న రామోజీరావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా,రామోజీరావు పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని నివాసానికి తరలించారు.
రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
ట్విటర్ వేదికగా భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘‘ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక మరియు రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన వారి క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనది.’’
‘‘వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ గర్వకారణమైన శ్రీరామోజీరావు గారు లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.