తాను సీఎం బంధువు అని.. తన కారునే అడ్డుకుంటావా అంటూ ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగాడు. తన కారు ఆపితే జీవో జారీ చేసి కోర్టు కేసులో ఇరికిస్తానంటూ పోలీసులకు షాకిచ్చాడు. ఖంగుతిన్న ట్రాఫిక్‌ పోలీసులకు అతని వాదన విని ఏం చేయాలో తోచకున్నా... కాసేపటి తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మల్కాజిగిరి ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌ క్రాస్‌రోడ్‌ వద్ద ఉదయం 11.45 గంటలకు జాకబ్‌రిక్కా అనే యువకుడు తన క్యాబ్‌  ను నిలిపాడు.

Also Read తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: రెబెల్స్ కు కేటీఆర్ వార్నింగ్..

అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై పార్క్‌ చేసి ఉన్న టాక్సీ కారుకు ఉండాల్సిన స్టిక్కర్‌ లేకపోవడంతో డ్రైవర్‌ను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జాకబ్‌ నేనెవరితో తెలుసా అంటూ ఎస్సైను ప్రశ్నించాడు. సీఎం తనకు బంధువు అని పెద్ద గొంతుతో అరుస్తూ చెప్పాడు. సీఎం బంధువైన తనకు అసలు కారుకు స్టిక్కర్‌ పెట్టుకోవాల్సిన అవసరమే లేదని.. తాను దొంగను కానని చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని నిబంధనల గురించి నచ్చజెప్పి కారుపై పోలీస్‌ రిజిస్ట్రేషన్‌ లేనందుకు రూ. 200, యూనిఫాం లేనందుకు రూ. 100, నిబంధనల ఉల్లంఘనకు రూ.500 మొత్తం రూ. 800 జరిమానా విధించారు.
 
  ఈ విషయమై మల్కాజిగిరి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా... అతను అలా వాదించాడే తప్ప.. పోలీసు విధులకు ఆటంకం కలిగించలేదని... నిజామాబాద్‌ జిల్లా భీమగల్‌కు చెందిన జాకబ్‌ వాదన గురించి తెలుసుకున్న ఆయన తండ్రి ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అతను అలా మాట్లాడుతుంటాడని వివరించారు. ఈ వాదన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అతనికి జరిమానా విధించి అనంతరం వదిలేసినట్లు పోలీసులు చెప్పారు.