కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైంది.. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హీరోయన్ సాయి పల్లవి మీద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విరుచుకుపడ్డాడు. హిందువుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. తెలుగురాష్ట్రాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సాయి పల్లవిపై ఫిర్యాదు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ : విరాటపర్వం మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా సాయిపల్లవి గోసంరక్షకుల దాడులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయి. కశ్మీర్ ఫైల్స్ పై సాయి పల్లవి చేసిన కామెంట్ సర్వత్రా కాక రేపుతున్నాయి. సాయిపల్లవిపై గో సంరక్షకులు, బజరంగ్ దళ్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని, జనం తిరగబడి కొడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైందని రాజా సింగ్ పేర్కొన్నారు.
కాశ్మీర్ కి వెళ్లి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయని.. వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయిపల్లవికి లేదు అని అన్నారు. తెలంగాణ, ఏపీ అన్ని పోలీస్ స్టేషన్లలో సాయి పల్లవిపై ఫిర్యాదు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒకరిని అరెస్టు చేస్తే ఇంకెవరూ హిందువుల జోలికి రారు అని పేర్కొన్నారు. మూవీ పాపులర్ కావాలని, తాము పాపులర్ కావాలని కొంతమంది నటీనటులు.. డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
సాయి పల్లవి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అనుబంధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఇస్లాం పైన కామెంట్ చేసే దమ్ముందా మీలో? క్రిస్టియన్స్ పైన కామెంట్ చేస్తారా? మీకు ఆ దమ్ము లేదు. మీకు దమ్ముంటే ముస్లింలపైనా, క్రిస్టియన్స్ పైనా కామెంట్స్ చేయండి. అంతే కానీ ఏం చెయ్యరు కదా అని హిందువులపై కామెంట్స్ చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు రాజాసింగ్. తక్షణమే సాయి పల్లవిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన సాయిపల్లవి, ఏం చెప్పిందంటే..?
విరాటపర్వం సినీ హీరోయిన్ సాయి పల్లవి కశ్మీర్ ఫైల్స్ పై చేసిన కామెంట్స్ కాంట్రవర్సి చిలికి చిలికి గాలివానగా మారుతోంది. విప్లవోద్యమ నేపథ్యంగా తీసిన విరాటపర్వం రిలీజ్ కి ముందే సంచలనాత్మకంగా మారింది. మరోవైపు దాడులు ఎక్కడైనా దాడులు లేనని, అది కశ్మీర్ అయినా అయినా గోసంరక్షణలో అయినా ఒకటేనని, గోవులను తరలిస్తున్న వాహనం డ్రైవర్ పై గోసంరక్షణ కుల దాడిని ఉద్దేశించి సాయిపల్లవి వ్యాఖ్యానించారు. కశ్మీర్ పండిట్లపైన జరిగిన దాడికి కశ్మీర్ ఫైల్స్ లో చూపించారు. మరి ముస్లిం అయినందుకు ఓ డ్రైవర్ పై దాడిని కూడా అలాగే చూడాలంటే సాయి పల్లవి వ్యాఖ్యానించడంపై మండిపడుతున్నాయి బిజెపి శ్రేణులు. వ్యక్తులు ఏ మతానికి చెందినా, ఏ వాదాన్ని నమ్మినా మానవత్వాన్ని మర్చిపోతే ప్రయోజనం లేదంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఈ వివాదానికి బీజం వేశాయి. మరోవైపు సాయి పల్లవి తన వ్యాఖ్యలపై స్పందిస్తానని, అయితే ఇది సరైన సమయం కాదని ప్రకటించారు.