వానదేవుడా కరుణించవయ్యా అని దేశమంతా వేడుకుంటారు. వానలు కురిస్తే సిరులు పండుతాయని వాన దేవున్ని మొక్కుకుంటారు. కానీ ఆ గ్రామ ప్రజలు మాత్రం వాన దేవుడా కరుణించి వెళ్లిపోవయ్యా అని మొక్కుతున్నారు. మా ఊరిలో ఒక్క చినుకు కూడా రాల్చకయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఆ ఊరిలో ఒకరిద్దరు కాదు ఏకంగా ఆ ఊరు ఊరే వానదేవుడిని వెళ్లిపోమంటున్నారు. ఎందుకంటే ? పాపం...

వానదేవుడా కరుణించి వెళ్లిపోవయ్యా అని ఆ గ్రామ ప్రజలంతా వేడుకుంటున్నారు. ఆ ఊరిలోని పొలం వద్ద బోరుబావిలో చిక్కుకున్న చిన్నారిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్షం రావడంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతోంది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చన్‌వెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం 6.45గంటల సమయంలో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. గత 24 గంటలుగా అధికారయంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలకు అక్కడ కురస్తున్న వర్షం అడ్డంకిగా మారుతున్నది. అయినప్పటికీ అధికారులు వర్షంలోనూ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

మరోవైపు రోబోటిక్‌ హ్యాండ్‌తో చిన్నారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. బోరుబావికి సమాంతరంగా మరో గోతిని తవ్వుతున్నారు. చిన్నారి సుమారు 40 అడుగుల లోతులో ఉందని తొలుత అధికారులు భావించారు. అయితే కెమెరా ద్వారా పరిశీలించినప్పటికీ చిన్నారి జాడ తెలియలేదు. దీంతో యంత్రంతో డ్రిల్‌ చేస్తున్నప్పుడు వచ్చిన ప్రకంపనల ధాటికి చిన్నారి మరికొంత లోతుకు జారి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు.

 ప్రస్తుతం 25 అడుగుల లోతు వరకూ గోతిని తీశారు. అది 40 అడుగులకు చేరితే కానీ చిన్నారి ఎంత లోతులో ఉందనేది అంచనావేయలేమని చెబుతున్నారు. మరోవైపు వైద్యులు బోరుబావిలోకి ఆక్సిజన్‌ అందిస్తున్నారు.

జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి 24 గంటల పాటు ఘటనా స్థలం లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు.

సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ , ఫైర్, పోలీసు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కేరళ, మంగళ గిరి , తదితర ప్రాంతాల వివిధ రిస్యూ టీం లు 4 ఇటాచీలు, 5 జేసీబీలు నిరంతరం శ్రమిస్తున్నాయి. పాపకు ఎమీ జరగదని తల్లిదండ్రులకు దైర్యం చెబుతున్శ మంత్రి మహేందర్ రెడ్డి.

పాప క్షేమంగా బతికి రావాలని మనమంతా కోరుకుందాం. వానదేవుడు అక్కడ నుంచి వెళ్లిపోవాలని వేడుకుందాం.