సారాంశం
తెలుగు ప్రజలకు కూల్ న్యూస్. తెలంగాణతో పాాటు ఆంధ్ర ప్రదేశ్ ఈ వేసవి మొత్తం వర్షాలు కురిసేలా కనిపిస్తోంది. మరో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో తెలుసా?
Rain Alert : ఇది వేసవికాలమా? అంటే అవును. వర్షాకాలమా? అంటేకూడా అవుననే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుంటే మరికొన్నిరాష్ట్రాల్లో వర్షభీభత్సం కొనసాగుతోంది. ఇక తెలుగురాష్ట్రాల్లో అయితే మరింత విచిత్ర వాతావరణం ఉంటోంది... ఓవైపు ఎండలు దంచికొడుతూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇదే సయమంలో ప్రతిరోజు వర్షాలు కురుస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభమయ్యింది మొదలు తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్డడం లేదు.
ఉదయం మెళ్లిగా ప్రారంభమయ్యే ఎండ మధ్యాహ్నానికి సుర్రుమంటోంది... భానుడి భగభగలు, ఈదురుగాలులు తెలుగు ప్రజలు సతమతం అవుతున్నారు. అయితే మళ్లీ సాయంత్రం అయ్యిందంటే చాలా వాతావరణ ఒక్కసారిగా రివర్స్ అవుతోంది.... ఆకాశంలో మేఘాలు కమ్ముకుని చిరుజల్లులు, అప్పుడప్పుడు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో వెధర్ చల్లబడి ఆహ్లాదకరంగా మారుతోంది. పిడుగులు, వడగళ్ల వానలతో ఒక్కోసారి ప్రమాదకరమైన వర్షాలు కురుస్తున్నాయి.
ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన పరిస్థితి ఈ వేసవిమొత్తం కొనసాగేలా కనిపిస్తోంది. ఈ రెండుమూడు రోజులు కూడా అత్యధిక ఉష్ణోగ్రతల నమోదవడంతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో భారీ వర్షాలు :
తెలంగాణలో ఈ మూడ్రోజులు ఎండావాన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలుంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... సాయంత్రం వేళలో మైదాన ప్రాంతాలు, చెట్లకింద ఉండకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.
తెలంగాణలోని నల్గొండ, వరంగల్, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం,సూర్యాపేట, ములుగు జిల్లాల్లో సాధారణం నుండి మోస్తరు వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురవడం, ఈదురుగాలలు వీయడంతో వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో కొంతకాలంగా ఉంటున్నట్లే ఎండావాన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాబోయే మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొన్నిజిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశాలున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తరాంద్ర జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇక విజయవాడ, గుంటూరు, వినుగొండ, చీరాల, ఒంగోలు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, తిరుపతి ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని... మధ్యాహ్నం ఎండలు దంచి కొడతాయని తెలిపారు. ఇక మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడటం, ఈదురుగాలులతో వాతావరణం చల్లబడటం జరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.