Telangana: ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు వరి సేకరణ అంశంపై కూడా చర్చ జరగనుందని సమాచారం.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో మెరుగైన ఫళితాలు రాబట్టడానికి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పదును పెంచి విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు కాకా రేపుతున్నాయి.
రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ హస్తం నేతలతో నేడు సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మేధోమథనంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా రాజకీయంగా తీవ్ర దూమారం రేపుతున్న అంశం ధాన్యం కొనుగులు. వరి సేకరణ అంశంపై కూడా సమావేశంలో ప్రధాన అజెండాలో చర్చ జరగనుంది. రాహుల్ గాంధీ నివాసంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం జరగడం గమనార్హం.
గత ఏడు రోజుల్లో తెలంగాణ పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కావడం ఇది రెండోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. జాతీయ రాజకీయాల వైపు ముందుకు సాగుతుండటం.. దీనికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతో చర్చలు జరుపుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మరియు కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేయాలని పార్టీలకు పిలుపునిచ్చిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అలాగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం ఇదే సమయంలో జరగనున్నాయి. గత 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రభుత్వ పునరాగమనాన్ని ఆపలేకపోయింది.
గత నెల ప్రారంభంలో, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటుంది, అయితే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నేతృత్వంలోని పార్టీతో కాదు.. ఆయన నమ్మదగినవాడు కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ తో, ఆయన పార్టీ టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదు, ఎందుకంటే ఆయనకు నమ్మకం లేదు. మేము ఆయనను 2004, 2009, 2014 మరియు 2019లో చూశాము. మేము ఇతర నాయకులను లేదా పార్టీని విశ్వసించగలము, కానీ కేసీఆర్ మరియు టీఆర్‌ఎస్‌లను కాదు”అని రేవంత్ రెడ్డి అన్నారు.
అధికార టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలకు రాష్ట్రంలో చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగేందుకు ఏర్పట్లు చేసుకుంటున్నదని సమచాారం. దీని కోసం రాష్ట్రంలో భారీ సభలతో పాటు.. ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నదని తెలిసింది. వాటికి కాంగ్రెస్ అధినాయకత్వం కూడా హాజరుకానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
