జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. రంగంలో దిగనున్న రాహుల్.. ఎంట్రీ ఎప్పుడంటే?

అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మూడు రోజుల పాటు  విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

Rahul Gandhi Priyanka to launch Telangana bus yatra on October 18 KRJ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సంసిద్దమవు తున్నాయి. వ్యూహాప్రతివ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్నారు.

ఈ మేరకు వారు అక్టోబర్ 18 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో బస్సుయాత్రలో పాల్గొననున్నారు. ఈ బస్సు యాత్ర ములుగు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 190 కిలోమీటర్ల మేర సాగనున్నది.  అలాగే.. రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని, పాదయాత్ర చేస్తారని, వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

మొదటి రోజు

ఈ షెడ్యూల్ లో భాగంగా అక్టోబరు 18న సాయంత్రం ములుగు నియోజకవర్గంలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం బస్సు యాత్రను లాంఛనంగా ప్రారంభించి ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ములుగు పట్టణం నుంచి భూపాలపల్లి వరకు 35 కిలోమీటర్ల మేర సాగే బస్సుయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అనంతరం భూపాలపల్లిలో పాదయాత్రలో పాల్గొంటారు. నిరుద్యోగ యువతతో కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానన్నారు. 

రెండో రోజు

మరుసటి రోజు రామగుండం నియోజకవర్గంలో పర్యటించనున్న రాహుల్ గాంధీ అక్కడ సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్మిక సంఘాల నాయకులతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికులతోనూ సంభాషించనున్నారు. అనంతరం రామగుండం నుంచి పెద్దపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర బస్సుయాత్రలో పాల్గొంటారు. బహిరంగ సభలో ఆయన రైస్ మిల్లర్స్ అసోసియేషన్, రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం రాహుల్ గాంధీ బస్సులో పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. సాయంత్రం గంటపాటు కరీంనగర్‌లో పాదయాత్రలో పాల్గొంటారు.

మూడో రోజు

అక్టోబర్ 20న బోధన్, ఆర్మూరు, నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. బోధన్ నియోజకవర్గంలో బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలతో ఆయన సంభాషించనున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా ఎంపీ సందర్శించనున్నారు. అనంతరం బోధన్ నుంచి ఆర్మూరు వరకు 50 కిలోమీటర్ల మేర బస్సుయాత్రలో పాల్గొంటారు. ఆర్మూరులో ఆయన బహిరంగ సభలో ప్రసంగించడంతోపాటు పసుపు, చెరుకు రైతులతో కూడా మాట్లాడనున్నారు. అనంతరం ఆర్మూరు నుంచి నిజామాబాద్ వరకు 25 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర సాగనుంది. సాయంత్రం పాదయాత్రతో నిజామాబాద్‌లో పాదయాత్రతో మూడు రోజుల పర్యటనను ముగించనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios