ముగ్గురు బాలికలకు గిఫ్ట్‌లు ఆశ చూపి మర్రి శ్రీనివాస్ రెడ్డి వారిని బావి దగ్గరకు తీసుకెళ్లాడని తెలిపారు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్. హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ కోర్టు ఉరిశిక్ష విధించడంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు.

25 ఏప్రిల్ 2019న హాజీపూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక పాఠశాలకు వెళ్లిందని సాయంత్రమైనా ఆమె ఇంటికి తిరిగి రాలేదన్నారు. తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టగా బావి వద్ద బాలిక మృతదేహం లభించిందన్నారు.

Also Read:హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష

దర్యాప్తులో పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా విచారణ చేపట్టామని.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ముందు నుంచి తమకు అనుమానం ఉందని సీపీ తెలిపారు. కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ సెక్స్ వర్కర్‌ను చంపిన కేసులో శ్రీనివాస్ నిందితుడని.. అందువల్లే ఆ వూరిలో తమ చూపు అతనిపై పడిందని మహేశ్ భగవత్ వెల్లడించారు.

ఈ క్రమంలో అదే నెల 30న రావిరాల దగ్గర శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని అనంతరం అతనిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. భువనగిరి రూరల్ ఇన్స్‌పెక్టర్ సురేందర్ రెడ్డి తొలుత కేసును దర్యాప్తును చేయగా.. అనంతరం ఏసీపీ భుజంగరావుకు కేసును అప్పగించామన్నారు.

Also Read:శ్రీనివాస్ శవాన్ని చూసినప్పుడే నిజమైన పండగ: బాధితుల తల్లీదండ్రులు

వేలిముద్రలు, డీఎన్ఏ, టెలిఫోన్ లొకేషన్ల విషయంలో ఎంతోమంది సాయం చేశారని సీపీ వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో రాచకొండ ఎస్‌ఓటీ కీలకపాత్ర పోషించిందన్నారు.

100 రోజుల్లోపే ఛార్జీ షీట్ దాఖలు చేశామని.. చంద్రశేఖర్ రెడ్డిని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపిక చేశామని మహేశ్ భగవత్ పేర్కొన్నారు. సాక్షులను బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని.. వారంతా గట్టిగా కోర్టుల్లో సాక్ష్యం చెప్పారని సీపీ తెలిపారు.