బీ ఫార్మసీ విద్యార్థినిపై ఘట్కేసర్ ప్రాంతంలో అత్యాచారం జరిగిందనే కేసు తీవ్రమైన మలుపు తీసుకుంది. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరించారు.
హైదరాబాద్: ఘట్కేసర్ లో బీ ఫార్మసీ విద్యార్థిన అపహరణ, ఆమెపై అత్యాచారం జరిగిందనే కేసులో కీలకమైన మలుపు తీసుకుంది. ఈ కేసును అంతా ఓ కట్టుకథగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తేల్చి పారేశారు. ఈ కేసులో ఓ విధమైన ఆధారాలు లభించడం లేదని చెప్పారు.
యువతి కావాలనే కట్టుకథ అల్లిందని ఆయన చెప్పారు. యువతి అపహరణ గానీ, ఆమెపై అత్యాచారం గానీ జరగలేదని ఆయన తేల్చిపారేశారు. అంతా ఓ కట్టుకథ అని ఆయన చెప్పారు. మొత్తంగా పోలీసులు తప్పుడు కేసుగా నిర్ధారించారు.
హైదరాబాదు సమీపంలోని ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసు అనూహ్యమైన మలుపు తీసుకుంది. నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసే సమయంలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బీ ఫార్మసీ విద్యార్థిని అసలు కిడ్నాప్ నకు గురి కాలేదని సీసీటీపీ ఫుటేజీల పరిశీలనలో తేలింది. దాంతో ఈ కేసు రాచకొండ పోలీసులకు సవాల్ గా మారింది.
రాంపల్లి ఆర్ఎల్ నగర్ కు చెందిన ఫార్మసీ విద్యార్థిని బుధవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకుని వెళ్లాడని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సెల్ ఫోన్ సంకేతాల ఆధారంగా అన్వేషణ ప్రారంభించారు.
ఫార్మసీ విద్యార్థినిని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద బాధితురాలిని గుర్తించి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు గురువారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు గురువారం రాత్రి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు బాధితురాలు చెప్పిన వివరాలతో పొంతన కుదరలేదు. దాంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను మరోసారి పరిశీలించారు. బాధితురాలు సాయంత్రం 6 నుచి రాత్రి 7.30 గంటల వరకు ఘట్కేసర్, యంనంపేట్, అన్నోజీగుడా తదితర ప్రాంతాల్లో ఒంటరిగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో తమ అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ల సెల్ ఫోన్ సంకేతాలు ఆ ప్రాంతాల్లో లేవని పోలీసులు తేల్చుకున్నారు.
దాంతో బాధితురాలిని పోలీసులు మరోసారి ప్రశ్నించారు. చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదే పదే ఫోన్ చేసి అడుగుతుండడంతో ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకుని వెళ్లాడని చెప్పినట్లు తెలిపింది. అయితే, ఆమెపై అత్యాచారం జరిగినట్లు మాత్రం వైద్యులు నిర్ధారించారు. దీంతో అన్నోజీగుడా ప్రాంతంలో పోలీసులు మరోసారి గాలించారు. అత్యాచారం జరిగిందని చెప్పడానికి ఏ విధమైన ఆధారాలు కూడా లభించలేదు.
అత్యాచారం ఎక్కడ జరిగిందనే ప్రశ్నకు ఫార్మసీ విద్యార్థిని పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. దాంతో ఆమె మానసిక పరిస్థితిపై పోలీసులకు అనుమానం కలిగింది. ఈ కోణంలో కుటుంబ సభ్యులను, ఆమె స్నేహితులను ప్రశ్నించారు గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఓ యువకుడిని కూడా ప్రశ్నించారు
తనను ఎవరో కిడ్నాప్ చేశారని గతంలో ఆమె ఫోన్ చేసిందని, అది నిజం కాదని తేలిందని, అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టానని ఆ యువకుడు చెప్పాడు. బీ ఫార్మసీ విద్యార్థిని తమను తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు శుక్రవారం నిర్ధారణకు వచ్చారు.
