సీఎం కుర్చీ మీద ముందే కర్చీఫ్ వేసుకుంటున్న నేతల సంఖ్య టీపీసీసీలో రోజురోజుకీ పెరుగుతోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది. కానీ, అప్పుడే టీపీసీసీ నేతలు ఊహాలోకంలో ఊరేగుతున్నట్లున్నారు. 2019 లో కాంగ్రెస్ దే అధికారమని సీఎం రేసులో తాము ఉన్నామని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. మరికొందరైతే మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేస్తున్నారు.
సీఎం కుర్చీ మీద ముందే కర్చీఫ్ వేసుకుంటున్న నేతల సంఖ్య టీపీసీసీలో రోజురోజుకీ పెరుగుతోంది.
మహిళా కోటాలో డీకీ అరుణ, గీతారెడ్డి సీఎం పీఠం తమదేనని గత ఎన్నికల నుంచే గట్టిగా తమ వాణి వినిపిస్తున్నారు. తీరా కారు కే ప్రజలు పట్టం గట్టడంతో 2019 ఎన్నికల్లో సేమ్ వాయిస్ వినిపించేందుకు రెఢీ అవుతున్నారు.
ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఈ మధ్య మీడియాకు అసలు కనిపించడమే మానేసిన మాజీ డిప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠం తనదేనని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు.
గతంలోనే డిప్యూటీ సీఎం గా పనిచేసిన అనుభవం, దళిత కోటా తనకు అనుకూలిస్తాయని భావిస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే వీరిలో ఎవరూ కూడా 2019 ఎన్నికల్లో సీఎం పదవి రేసులో ఉన్నట్లు మీడియా ముఖంగానైతే చెప్పలేదు.
కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే 2019 లో కాంగ్రెస్ దే అధికారం అని, అప్పుడు సీఎం రేసులో తానే ఉంటానని ఢంకా బజాయించి మీడియా ముందే చెప్పేస్తున్నారు. భవిష్య త్తులో ఎప్పటికైనా తాను సీఎం కావటం ఖాయమని తేల్చేశారు.
అంతర్గత ప్రజాస్వామ్యం అత్యధికంగా ఉండే పార్టీ కాబట్టి కాంగ్రెస్ లో ఏం మాట్లాడినా చెల్లుతుంది.
